
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య హఠాన్మరణం చెందారు.
సాక్షి, కడప: టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య హఠాన్మరణం చెందారు. బుధవారం తెల్లవారు జామున ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. బ్రహ్మయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
ఫిబ్రవరిలో కూడా గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. కాగా, బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున రాజంపేట అసెంబ్లీ సీటును ఆశించి భంగపడ్డారు. ‘పార్టీలో కష్టపడిన వారికి కాకుండా వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నార’ని తన ఆవేదనను అప్పట్లో మీడియా ముందు వెళ్లబోసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బత్యాల చంగల్రాయుడు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్సార్-కడప జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.