రెబల్‌తో బోణీ..

tdp naminations in vijayanagaram - Sakshi

చీపురుపల్లిలో రెబల్‌గా కె.త్రిమూర్తులు రాజు నామినేషన్‌

అధికారిక ప్రకటన ఇవ్వడానికి జంకుతున్న టీడీపీ

నెల్లిమర్ల, విజయనగరంలో తేలని పంచాయితీ

సాక్షి, చీపురుపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు పర్వానికి తెర లేచిన మొదటి రోజునే బోణీ పడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెబల్‌ అభ్యర్థిగా కె.త్రిమూర్తులురాజు నామినేషన్‌ దాఖ లు చేశారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునను అధిష్టానం ఎంపికగా చేయగా... దానిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులురాజు సోమవారం ఉదయం నామినేషన్‌ వేశారు. పట్టణంలోని ఆంజనేయపురంలో గల ఆయన నివాసం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయిలుదేరి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్‌ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.సాల్మన్‌రాజ్‌కు అందజేశారు.

అంతకుముందు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2014లో పార్టీ అధిష్టానం మృణాళినిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించి గెలిపించాలని ఆదేశిస్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గెలిపించామనీ, ఆమె గెలిచిన తరువాత నియోజకవర్గంలో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ పేర్కొన్నారు. మూడేళ్లుగా ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెబుతున్నా కనీసం పట్టించుకోలేదనీ, ఆమెకు ఈసారి టిక్కెట్టు ఇవ్వొద్దని సమన్వయ కమిటీలో 80 శాతం మంది వ్యతిరేకించామనీ, అయినా ఆమె కుమారుడికి ఇవ్వడం తమను బాధించిందని చెప్పారు. మరో ఐదేళ్లు బాధలు అనుభవించలేమని, కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా పోటీకి వెళ్లాలని భావించినట్లు తెలిపారు. ఆయనకు చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్‌ మద్దతు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top