ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినందుకు..

TDP Leaders Attack on YSRCP Activists PSR Nellore - Sakshi

ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చిన టీడీపీ కార్యకర్తలు

నెల్లూరు, తోటపల్లిగూడూరు : టీడీపీ కార్యకర్తల చేతిలో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి ఆదుకోవాలని ఎమ్మెల్యే కాకాణికి, పోలీసులకు విన్నవించారనే నెపంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం కోడూరు పంచాయతీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపట్టపుపాళెం గ్రామం వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన కోడూరు ఖాదర్‌బాషకు అదే గ్రామం పెద్ద కాపు, టీడీపీ నాయకుడు ఆవుల మునిరత్నంల మధ్య ఏప్రిల్‌ 11వ తేదీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున వివాదం తలెత్తింది. దీనిపై ఇరువర్గాల వారు తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీనిని మనస్సులో పెట్టుకున్న గ్రామ పెద్ద కాపు ఆవుల మునిరత్నం సదరు ఖాదర్‌బాషాను ఇతర కాపుల సహకారంతో గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటూ వస్తున్నాట్లు బాధితుడు తెలిపాడు.

కాకాణికి వినతి
కోడూరు పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకులు కావలిరెడ్డి రంగారెడ్డి సహకారంతో ఖాదర్‌బాషా, పలువురు కార్యకర్తలు బుధవారం నెల్లూరులోని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు తమ సమస్యను వివరించారు. ఎన్నికల సమయంలో జరిగిన చిన్న ఘటనను మనస్సులో పెటుకుని పెద్ద కాపు మునిరత్నం, అతని వర్గీయులు తమను ఊర్లోకి అడుగుపెట్టనీయకుండా భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయంలో పోలీసులు సైతం తమకు న్యాయం చేయలేకపోతున్నారని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కాకాణి టీడీపీ ఆగడాలను ఇక సహించబోనన్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంకటేశ్వరపట్టపుపాళెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయాందోళనలకు గురి చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఎస్సై మనోజ్‌కుమార్‌కు ఓ వినతిపత్రాన్ని అందించి రక్షణ కల్పించాల్సిగా కోరారు.

గ్రామంలోకి రాగానే దాడి
ఎమ్మెల్యే కాకాణికి, ఎస్సైలకు ఫిర్యాదు చేసి గ్రామానికి చెరుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలైన పామంజి గోవిందమ్మ, బుచ్చింగారి గోవిందమ్మ, బుచ్చింగారి గోవిందు, బుచ్చింగారి బాబు, పామంజి శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను గాయపరిచిన వారిలో పెద్దకాపు ఆవుల మునిరత్నం, టీడీపీ కార్యకర్తలైన అక్కంగారి పెదనాగూరు, అక్కంగారి విజయమ్మ, అక్కంగారి భవాని, పామంజి వాసు, పామంజి నారయ్య, వావిళ్ల రవి, ఆవుల గణేష్, అక్కంగారి చాన్‌బాషా, అక్కంగారి మౌలాలి, అక్కంగారి మస్తాన్, కొండూరు గోవిందమ్మ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అందుకున్న ఎస్సై మనోజ్‌కుమార్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పూర్తిస్థాయిలో విచారించి నిందితులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై మనోజ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top