రెవెన్యూ అధికారులపై దాడి

TDP Leader Family Attack on Revenue Staff Visakhapatnam - Sakshi

మారికవలసలో టీడీపీ నేత అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు

ఒంటిపై డీజిల్‌ పోసుకుని బెదిరింపులకు దిగిన టీడీపీ నేత భార్య

తీవ్ర ఉద్రిక్తత నడుమ షెడ్‌ కూల్చివేత

దాడికి దిగిన సోంబాబు కుటుంబ సభ్యులపై క్రిమినల్‌ కేసులు

విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ శేషగిరిరావు

అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. మీ అంతు చూస్తామని బెదిరించారు. నిర్మాణం జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారు. అయినా అధికారులు భయపడకుండా అక్రమంగా వేసిన భారీ షెడ్‌ను ధ్వంసం చేశారు. ఆక్రమణలకు పాల్పడడంతో పాటు దాడికి పాల్పడ్డ టీడీపీ నేత కుటుంబంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

మధురవాడ(భీమిలి):  టీడీపీ నేత, మాజీ కార్పొరేటర్‌ మన్యాల సోంబాబు కుటుంబ సభ్యులు విశాఖ రూరల్‌ మండలం పరదేశిపాలెం రెవెన్యూ సర్వే నెంబరు 109 మారికవలసలోని ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేసిన భారీషెడ్‌ను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. ఈ క్రమంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిర్మాణం తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై డీజిల్‌ పోసుకుని మాజీ కార్పొరేటర్‌ భార్య బెదిరింపులకు దిగారు. అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు నోటికొచ్చినట్లు తిడుతూ  వీఆర్‌వో అప్పారావును తోసేశారు. దీనిపై టీడీపీ నేత మన్యాల సోంబాబు, అతని కుమారుడు, కుటుం బ సభ్యులపై ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసుతో పాటు వి«ధి నిర్వహణలో  ఉద్యోగులను అడ్డగించి, దాడికి దిగిన  నేరాలపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తామని విశాఖ రూరల్‌ మండల తహసీల్దారు శేషగిరిరావు చెప్పారు. అంతేకాకుండా  ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి  పశువుల పాక పేరుతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని భారీ షెడ్‌ వేసిన విషయాన్ని వివరిస్తామన్నారు.

ఇదీ వ్యవహారం
సర్వే నెంబరు.109లో తన పాఠశాలను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి  సదరు వ్యక్తి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రయత్నాలపై పలు దఫాలుగా సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితం కావడంతో ఎప్పటికప్పుడు  రెవెన్యూ  అధికారులు చెక్‌ పెడుతున్నారు.  తాజాగా ఇదే సర్వే నెంబరులో పశువుల పాక నిర్మాణం కోసమని హైకోర్టు అనుమతి తెచ్చుకుని  పక్కనే ఉన్న సుమారు రూ. 5కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సుమారు 400గజాల విస్తీర్ణంలో భారీ షెడ్‌ నిర్మాణానికి  ఉపక్రమించారు. దీనిపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘అడ్డకునేదెవరు?’ అనే శీర్షికన కథనం ప్రముఖంగా ప్రచురితమైంది. దీనిపై విశాఖ  రూరల్‌ మండల తహసీల్దారు శేషగిరిరావు స్పందించారు. ఆయన ఆదేశాలు మేరకు ఇన్‌చార్జ్‌ ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్‌వో కె. అప్పారావు పరిశీలన చేసి ఇక్కడ నిర్మాణం జరుగుతున్న భారీ షెడ్‌కు ఏ రకమైన కాగితాలు లేక పోవడంతో  షెడ్‌ను నేల మట్టం చేశారు.

అధికారులు ఏమన్నారంటే..
ఇక్కడ మన్యాల సోంబాబు తన తల్లి పేరుతో కోర్టు నుంచి పశువుల పాక నిర్మాణానికి అనుమతి తెచ్చి  నిర్మాణం చేశారు. అది కాకుండా పక్కనే ఉన్న కోట్లు విలువ చేసే 45 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు మరో భారీ షెడ్‌ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా  పంచనామా చేస్తుండగా  వాచ్‌మెన్‌ ఆధార్‌ కార్డు కోసం  షెడ్‌లోకి వెళ్లిని సిబ్బందిని  టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యులు గృహనిర్భందం చేశారు. ఇదేమని ప్రశ్నించిన వీఆర్‌వో అప్పారావును బెదిరించారు.  ఇతర రెవెన్యూ సిబ్బందిపైనా బెదిరింపులకు దిగి, దాడికి యత్నించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top