ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు

Supreme Court To Hear Cash For Vote Scam In February - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. టీడీపీ అధికార దాహానికి ప్రతీకగా నిలిచిన ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ వాదించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అనంతరం ఈ కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని సిద్దార్థ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్‌ మదన్‌బీ లోకూర్‌.. ఆ విషయంలో తామేమీ చేయలేమని, ఫిబ్రవరిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.

సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం : ఆళ్ళ రామకృష్ణారెడ్డి
ఓటుకు కోట్లు కేసులో సత్వర విచారణ కోసం తాను చేసిన విఙ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించిందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నాయని, విచారణను వాయిదా వేయాలన్న చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్దార్థ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చిందని తెలిపారు.

కాగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రేవంత్‌ రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.  2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక కూడా ఇచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top