గరీబ్‌రథ్‌ పట్టాలు తప్పుతుందా ?

Story On Visakhapatnam Secundrabad Garib Rath Express  - Sakshi

సామాన్యులకు సరసమైన ధరకే ఏసీ ప్రయాణం.. నిత్యం వంద శాతం ఆక్యుపెన్సీతో సర్వీసులు..నెలా రెండు నెలల ముందే పూర్తి అయ్యే రిజర్వేషన్లు..ఇవే గరీబ్‌ రథ్‌ రైలు ప్రత్యేకతలు. పేదలకు ఏసీ ప్రయాణాన్ని చేరువ చేసి.. దాదాపు 11 ఏళ్లుగా నిత్యం విశాఖపట్నం– సికింద్రాబాద్‌ల మధ్య అపూర్వ ఆదరణతో పరుగులు తీస్తున్న ఈ రైలు పట్టాలు తప్పి సామాన్యులకు దూరం నుందా?.. ఏసీ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చుకొని ఉన్నత వర్గాల దరికి చేరనుందా ? రైల్వేబోర్డు నుంచి అందుతున్న సంకేతాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. 

సాక్షి, విశాఖపట్నం : దేశవ్యాప్తంగా గరీబ్‌ రథ్‌ రైళ్లను 2005లో ప్రవేశపెట్టారు. గరీబ్‌రథ్‌ అంటే పేదల రథం. అతి తక్కువ ధరకే పేదలకు ఏసీ కోచ్‌లు అందించాలనే లక్ష్యంతో ఈ సేవలు మొదలయ్యాయి. ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే ఇందులో 2/3 వంతు ఛార్జీ వసూలు చేస్తారు. ఇందులో భాగంగా 2008లో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకూ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ప్రారంభమయ్యాయి. వారానికి రెండు సార్లు నడిపినప్పుడు వస్తున్న ఆదరణ చూసి వారానికి 3 సార్లు సర్వీసు పెంచారు. ఆక్యుపెన్సీకి విపరీతమైన డిమాండ్‌ వస్తుండటంతో 2015 నుంచి ప్రతి రోజూ నడపడం ప్రారంభించారు. అయినా నిత్యం రద్దీగానే ఉంటోంది.

చౌకగా ఏసీ ప్రయాణం..
మొత్తం 18 కోచ్‌లుండగా.. 892 బెర్తుల్ని జనరల్‌ కోటాగా, 422 బెర్తుల్ని తత్కాల్‌ కోటాగా భర్తీ చేస్తున్నారు. మిగిలిన ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్, సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ల కంటే.. గరీబ్‌రథ్‌ ప్రయాణం చాలా చౌక. విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాలంటే ఇతర ట్రైన్‌లలో థర్డ్‌ ఏసీ 1050, సెకెండ్‌ ఏసీ 1490 చెల్లించాలి. కానీ గరీబ్‌రథ్‌ జనరల్‌ కోటాలో అయితే.. రూ.715 చెల్లించాల్సి ఉండగా.. తత్కాల్‌లో రూ.1030 ధర ఉంది. అన్నీ ఏసీ బోగీలుండటం, టికెట్‌ ధర కూడా అందుబాటులో ఉండటంతో సామాన్యులు సైతం గరీబ్‌రథ్‌ ప్రయాణానికే ఎక్కువగా మొగ్గు చూపేవారు. అప్పటి వరకూ ట్రైన్‌లో ఏసీ ప్రయాణమంటే.. అమ్మో అంత ఖరీదా.. అని అదిరిపడే ప్రయాణికులకు చల్లని ప్రయాణాన్ని పరిచయం చేసింది గరీబ్‌రథ్‌. నెల రోజుల తర్వాత బుక్‌ చెయ్యాలని ప్రయత్నించినా వెయిటింగ్‌ లిస్ట్‌ దర్శనమిస్తుంటుంది. ఇలా నిత్యం రద్దీగా ఉండే ఈ ట్రైన్‌ని రద్దు చేసే యోచనలో రైల్వేశాఖ ఆలోచనలు పట్టాలెక్కాయి.

గరీబ్‌రథ్‌ స్థానంలో ఏసీ ఎక్స్‌ప్రెస్‌...
దేశవ్యాప్తంగా ఉన్న గరీబ్‌రథ్‌ రైళ్లని రద్దు చేసేందుకు రైల్వే బోర్డు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో ఏసీ ఎక్స్‌ప్రెస్‌లను నడిపితే.. రెట్టింపు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో సామాన్యుడి ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 52( 26 పెయిర్స్‌) గరీబ్‌రథ్‌ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇందులో నిత్యం రద్దీగా ఉండేవి కేవలం 5 ట్రైన్లు మాత్రమే. వాటిలో విశాఖ–సికింద్రాబాద్, సికింద్రాబాద్‌–విశాఖపట్నం గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే 100 శాతం రద్దీతో మొదటి స్థానంలో ఉన్నాయి. అలాంటి రైలుని రద్దు చేసి దాని స్థానంలో ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని భావిస్తున్నారు.

గరీబ్‌రథ్‌లో ఒక బోగీకి టిక్కెట్ల ద్వారా రూ.52 వేల వరకు ఆదాయం వస్తుంది. కానీ.. సాధారణ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ వేస్తే థర్డ్‌ ఏసీ బోగీకి రూ.76 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఒక రోజుకి ఒక వైపు గరీబ్‌రథ్‌ బదులుగా ఏసీ ఎక్స్‌ప్రెస్‌ నడిపితే రూ.5 లక్షలకు పైగా అదనపు ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు కడుతున్నారు.  దీంతో పాటు ఈ రైళ్లు ప్రారంభమై దశాబ్ద కాలం గడుస్తోంది. పాత కోచ్‌ల స్థానంలో కొత్త కోచ్‌లు ఏర్పాటు చెయ్యాలంటే భారం పడుతుందనేదీ మరో కారణంగా రైల్వే భావిస్తోంది. అందువల్లనే గరీబ్‌రథ్‌కు స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. గరీబ్‌రథ్‌ రాకపోకల్ని నిలిపెయ్యొద్దంటూ వాల్తేరు రైల్వే వర్గాలతో పాటు ప్రజలూ కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top