
సిర్హింద్: పంజాబ్‌లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12204)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రైలులోని ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో ఒకదానిలో నుండి పొగలు రావడంతో ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలులో అమృత్‌సర్ నుండి సహర్సాకు ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రయాణికులు ప్రమాదంతో బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రైలులోని జీ-19 కోచ్ నుండి పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే వారిలోని ఒకరు అత్యవసర గొలుసును లాగారు. రైలు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ కోచ్‌లోని ప్రయాణికులను తరలించే ప్రయత్నం చేశారు. అయితే నిమిషాల వ్యవధిలో మంటలు పక్కనే ఉన్న రెండు కోచ్‌లకు వ్యాపించాయి. దీంతో అధికారులు ఆ మూడు కంపార్ట్‌మెంట్‌లను రైలు నుంచి వేరు చేయవలసి వచ్చింది. ఈ మూడు బోగీలు దెబ్బతిన్నాయి. ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
VIDEO | Sirhind, Punjab: A major train accident was averted near Sirhind railway station when a fire broke out in the Garib Rath Express travelling from Amritsar to Saharsa, just half a kilometre ahead of Ambala. The train was halted immediately after smoke was seen billowing… pic.twitter.com/vXwHoqTEJB
— Press Trust of India (@PTI_News) October 18, 2025
ప్రయాణికులు వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు.. అగ్నిమాపక సిబ్బందిని సంఘటనా స్థలానికి పిలిపించారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే 32 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు గాయాలపాలు కాగా, ఆమెను ఫతేఘర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రికి తరలించామని రైల్వే అధికారి రత్తన్ లాల్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.