ఎన్నాళ్లుగా ఎదురు చూసినా...

Special Story About Fishermans In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : సముద్రంలో వేటంటేనే ప్రాణాలతో చెలగాటం. అయినా బతుకు తెరువుకోసం దానిని వదులుకోవడం లేదు. ఉన్న ఊళ్లో అవకాశాలు లేకున్నా... అదే వృత్తిని వెదుక్కుంటూ వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారు. అక్కడి నుంచి గమ్యం లేని వారి ప్రయాణంలో చిక్కులు ఎదురవుతున్నాయి. విదేశీ జలాల్లోకి ప్రవేశించి... అక్కడివారి బందీలుగా మారాల్సి వస్తోంది. రెండేళ్లలో శ్రీలంక... పాక్‌... బంగ్లా... దేశ రక్షక దళాల బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారులు ఇప్పటికీ స్వగ్రామం చేరలేక నానా అవస్థలు పడుతున్నారు.

సుమారు 22 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో వివిధ కారణాలవల్ల సుమారు 2 వేల మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికే వలస వెళ్లారు. తీరప్రాంత గ్రామాల్లో పనిచేయలేని వారు, వృద్ధాప్యంలో వున్న వారు మాత్రమే గ్రామాల్లో వున్నారు. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి, పతివాడ బర్రిపేట, కోనాడ, భోగాపురం మండలంలో ముక్కాం, చేపలు కంచేరు, కొండ్రాజుపాలెం తదితర గ్రామాలు నుంచి వలసలు ఎక్కువగా వున్నాయి.

వీరిలో అత్యధికంగా విశాఖపట్నం, మంగమారిపేట, గుజరాత్‌లోని సూరత్, వీరావల్‌ ప్రాంతాల్లో దినసరి వేట కూలీలుగా చేరుతున్నారు. ఇక్కడి తీర ప్రాంతాలు కాలుష్యంతో మత్స్య సంపద కాస్తా కనుమరుగైపోవడంతో వలసలు వీరికి తప్పడం లేదు. పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామం నుంచే సుమారు వెయ్యిమంది వరకు మత్స్యకారులు వలస పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడచిన నాలుగేళ్లుగా ఎంతోమంది బోటు ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది విదేశీ రక్షకదళాలకు చిక్కి అక్కడ బందీలవుతున్నారు.

గతేడాది పాక్‌... నేడు బంగ్లా...
గతేడాది నవంబర్‌ 8వ తేదీన పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్క నరిసింగు, నక్క ధనరాజు, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన మైలపల్లి గురువులు వీరావల్‌ నుంచి వేటకు బయలుదేరి పాక్‌ జలాల్లో పొరపాటున ప్రవేశిం చి అక్కడి రక్షణ దళాలకు బందీలుగా చిక్కారు. తాజాగా అక్టోబర్‌ 2వ తేదీన అదే గ్రామానికి చెందిన మారుపల్లి నరిసింహులు, వాసుపల్లి అప్పన్న, బర్రి రాము, వాసుపల్లి కాములు, రాయితి రాము, వాసుపల్లి అప్పన్న, మారుపల్లి పోలయ్య, రాయితి అప్పన్న బంగ్లాదేశ్‌ సముద్రజలాల్లోకి పొరపాటున వెళ్లి అక్కడ బందీలుగా చిక్కారు. పాక్‌ అదుపులో వున్న ఐదుగురు మ త్స్యకారుల కుటుంబాలు తమవారి కోసం సు మారు 11 నెలలుగా ఎదురుచూస్తున్నా ఫలితంలేకపోయింది. ఇప్పుడు ఎనిమిది మంది మళ్లీ బంగ్లాలో చిక్కుకున్నారు. వీరి క్షేమసమాచారం కూడా తమకు తెలియడం లేదనీ, విడుదలకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top