బ్యాంకులకు సెలవులే.. సెలవులు

బ్యాంకులకు సెలవులే.. సెలవులు


తొమ్మిది రోజుల్లో ఐదు సెలవులు

వచ్చేనెల జీతాలు, పెన్షన్లు జాప్యం?

ఏటీఎంల వద్ద పెరగనున్న తాకిడి


 

చల్లపల్లి : ఈనెల, వచ్చే నెల్లో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు రావడంతో ఖాతాదారుల కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సెలవులతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనుకు జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28 తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ మధ్య తొమ్మిది రోజుల్లో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. మిగిలిన రెండు రోజుల్లో ఒకపూట మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సొమ్ముల కోసం ఖాతాదారులు, ఉద్యోగులు, పెన్షనర్స్‌కు ఇబ్బందులు తప్పేట్టులేవు. ఈనెల 28న శ్రీరామ నవమి, ఏప్రిల్ 2న మహావీర్ జయంతి రోజున సాధారణంగా సెలవులు.బ్యాంకులు పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

 

జీతాలు, పెన్షన్స్‌లో జాప్యం?




జిల్లాలో 45 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 12వేల మంది పెన్షన్‌దారులున్నారు. వీరిలో అత్యధికంగా 14,850 మంది ఉపాధ్యాయులున్నారు. వీరందరికీ బ్యాంకుల నుంచే జీతాలు అందాలి. 28 శ్రీరామనవమి, 29 ఆదివారం, ఏప్రిల్ 2న మహావీర్ జయంతి, 3న గుడ్‌ఫ్రైడే, 5న ఆదివారం కావడంతో ఖజానాకు సెలవులు. దీనికితోడు మార్చి 31 ఆర్థిక సంవత్సరం చివరిరోజు. అందునా వరుస సెలవులు రావడంతో వచ్చే నెలలో జీతాలు, పెన్షన్లు వారం రోజులపైనే జాప్యం అయ్యే అవకాశం ఉంది.

 

ఏటీఎంలకు పెరగనున్న రద్దీ..



బ్యాంకులు సెలవు అయినా ఏటీఎంల్లో డబ్బులు తీసుకునే ఖాతాదారులు వరుస సెలవులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వరుస సెలవులతో ఏటీఎంలో సొమ్ములు పెట్టేందుకు సిబ్బంది అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. అన్నీ సక్రమంగా ఉన్న సమయంలోనే ఏటీఎంలు కిక్కిరిసిపోతాయి. ఇక తొమ్మిది రోజుల వ్యవధిలో నాలుగురోజులు సెలవులు రావడంతో ఏటీఎంల వద్ద మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది.



ముఖ్యమైన మూడు పండుగలు..



శ్రీరామనవమి, గుడ్‌ఫ్రైడే, మహావీర్ జయంతి వరుసగా వచ్చాయి. పండుగలకు బాగా ఖర్చులుంటాయి. ఏటీఎంలు చేతిలోకి వచ్చిన తరుణంలో కొద్ది మొత్తంలోనే సొమ్ములు ఇళ్లలో అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు, ఉద్యోగులు, పెన్షనర్స్‌కు నగదు తీసుకునే విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులను జిల్లా వాసులు కోరుతున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top