ఐదేళ్ల పాలనకు ఓ నమస్కారం! | Sidda Raghava Rao Failed To Help Farmers | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల పాలనకు ఓ నమస్కారం!

Apr 11 2019 11:55 AM | Updated on Apr 11 2019 11:55 AM

Sidda Raghava Rao Failed To Help Farmers - Sakshi

ఎన్నికల ముందు ప్రారంభించిన బ్రిడ్జి ఇదే

సాక్షి, దర్శి (ప్రకాశం): టీడీపీ ప్రభుత్వ పాలనలోఐదేళ్లు వెనక్కు చూస్తే ప్రతి ఒక్కరికీ నష్టాలు తప్ప ఏం ఒరిగిందనే విమర్శలు మెండుగా ఉన్నాయి. 2014–15వ సంవత్సరంలో అక్రమ కేసులతో నియోజకవర్గం అట్టుడికింది. మంత్రి శిద్దారాఘవరావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ నేతల పై దాడులు చేసి అక్రమ కేసుల పేరుతో నియోజకవర్గంలో భయభ్రాంతులు సృష్టించారు. ఆతరువాత రైతులకు సాగర్‌ జలాలు విడుదల చేశారు. రైతులు వరి నాటుకున్న తరువాత సాగర్‌ జలాలు పూర్తి స్థాయిలో అందజేయలేదు. దీంతో వరి పంట పూర్తి గా ఎండి పోయింది. కానీ మంత్రిగా ఉన్న శిద్దారాఘవరావు పట్టించుకోకుండా వదిలేశారు.

అప్పట్లో వైఎస్సార్‌ సీపీ  నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సాగర్‌ కాలువలపై పర్యటన జరిపి కొంతమేర రైతులకు సాగర్‌ జలాలు అందించేందుకు కృషి చేశారు. మిరప రేట్లు బాగా ఉన్నా తెగుళ్లు రావడంతో రైతులు భారీగా నష్ట పోయారు. కంది వేసిన రైతులకు కనిస మద్దతు ధర కూడా రాలేదు. 2015–16లో సాగర్‌ జలాలు విడుదల చేయలేదు. రైతులు కంది, మిరప వంటి పంటలు వేసుకున్నారు. కందికి కొంత గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు అనుకూలించలేదు. 2016–17లో సాగర్‌ జలాలు విడుదల కాలేదు. వర్షాలు కురవక వేసిన పంటలు బాగా దెబ్బతిన్నాయి.

మిరప మొదట్లో మంచి గిట్టుబాటు ధరలు ఉండటంతో రైతులు ఆపంటలే అధికంగా వేశారు. దీంతో రేటు పడిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. 2017–18 సాగర్‌ జలాలు విడుదల కాలేదు. సంవత్సరం నియోజకవర్గంలో మరణ మృదంగంలా విషజ్వరాలు విజృంభించాయి. ప్రతి రోజూ ఒకటీ రెండు మరణాలు సంభవించడం జరిగింది. సుమారు 80 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది సాగర్‌ జలాలు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షాలు పూర్తి స్థాయిలో కురవక కురువు మేఘాలు కమ్ముకున్నాయి. కందులకు గిట్టు బాటు ధరలు రాలేదు. ఇతర రాష్ట్రాల్లో కందులు తక్కువ ధరలకు దిగుమతి చేసుకుని ఇక్కడి రైతుల పేరిట మార్క్‌ ఫెడ్, నాపెడ్‌ ద్వారా రైతులకు చెందాల్సిన గిట్టు బాటు ధరలను మంత్రి బినామీలే మింగేశారు.

మిరప పంటలు వేసిన రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. కరువు దెబ్బకు రైతులు కూడా కూలి పనులకు పోవడం మొదలు పెట్టారు. 2018 –19 సంవత్సరంలో ప్రభుత్వం సాగర్‌ జలాలు ఇస్తామని చెప్పడంతో వేసిన కందిని చెడగొట్టి వరి నాటుకున్నారు. వరి కంకి దశలోకి వచ్చేసరికి సాగర్‌ జలాలు నిలిపివేశారు. దీంతో కంది పంటకు ఎకరాకు రూ.5 వేలు, వరి పంటలో రూ.25 వేలు రైతులు నష్ట పోయారు. ఈ తరుణంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్‌ వరి రైతుల పరిస్థితి చూసి చలించి పోయారు. వరి పొలాలు సందర్శించి రైతులకు సాగర్‌ జలాలు విడుదల చేయాలని అధికారులను డిమాండ్‌  చేశారు. అయినప్పటికీ మంత్రి శిద్దారాఘవరావు కాని , జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ సాగర్‌ జలాలు తీసుకు రావడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో వేలాదిఎకరాలు ఎండి రైతులు నష్ట పోయారు.

ఐదేళ్లుగా గొంతెండుతోంది..
ఎన్‌ఏపీ రిజర్వాయర్‌ ద్వారా ప్రతిరోజు దిగు నీరు అందిస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్‌లు కుమ్మక్కై బిల్లులు చేసుకుని ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు బొక్కుతున్నారు. ఇలా ప్రజలకు అందించాల్సిన తాగునీటిలో కూడా అవినీతిని పారించారు. నీరు చెట్టు పేరుతో భారీగా దోచుకున్నారు. ప్రతి పథకానికి జన్మభూమి కమిటీలు పెట్టి సామాన్యులకు పింఛన్‌లు , కార్పొరేషన్‌ లోన్‌లు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల పంపిణీ పేరుతో అనాదీనం భూములను సాగు దారులనుంచి అతి తక్కువ ధరలకు కొనుగోనుగోలు చేసి ప్లాట్లుగా వేసి వాటిని అధిక లాభాలకు అమ్మకాలు చేసి వారికి ప్రభుత్వ పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ ముసుగులో ఈ పట్టాలన్నీ మంత్రి శిద్దా రాఘవరావు ఉచితంగా ఇచ్చినట్లు ప్రచారం చేసి పట్టాల ముసుగులో పక్కా దోపిడీకి పాల్పడ్డారు.

ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం
నియోజకవర్గంలో 12 విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లలో 48 మంది నూతన సిబ్బందిని తీసుకున్నారు. వారిలో ఎస్సీల కోటాలో 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్‌.. రోష్టర్‌ పాటించాలి. అయితే కేటాయించాల్సిన ఉద్యోగావకాశాలను కూడా ఇతర కులాలకు ఒక్కో ఉద్యోగానికి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకుని ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారు. ఈ తతంగంలో మంత్రి శిద్దా హస్తం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు ఆయనకు దూరమయ్యారు. ఈకారణంతోనే టీడీపీకి చెందిన ప్రధాన ఎస్సీ, ఎస్టీ నాయకుతు గాలిమూటి దేవప్రసాద్, ఉప్పల పాటి కిరణ్‌ ప్రసాద్, జి. వరప్రసాద్, కవలకుంట్ల గోవింద్‌ ప్రసాద్, కే సన్నీబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  కొమ్మూరి రవిచంద్ర వంటి మంత్రికి ముఖ్య అనుచరులుగా ఉన్న ప్రధాన ఎస్సీ , ఎస్టీ నాయకులు మంత్రికి దూరమయ్యారు.

హామీలు గాలికొదిలారు
దొనకొండలో ఇండస్ట్రియల్‌ కారిడార్, విమానాశ్రయం అభివృద్ధి, హెలికాప్టర్‌ల కంపెనీ, కార్ల విడిభాగాల కంపెనీలంటూ మంత్ర చెప్పారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పిచ్చిచెట్లు దర్శిన మిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరక పోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. దర్శిలో డిగ్రీకళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్, మినీ స్టేడియం, జీప్లస్‌ త్రీ కాంప్లెక్స్‌లు, శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. దర్శిలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి కనీసం ఆ ఊసే ఎత్తలేదు. చందవరం సమీపంలోని గుండ్లకమ్మపై ఏర్పాటు చేసిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే ఇదే నా.. అభివృద్ది అంటూ మంత్రి  ప్రారంభించారు. ప్రస్తుతం ఆబ్రిడ్జిపై కనీసం ఆపార్టీ  గుర్తు అయిన సైకిల్‌ కూడా తిరగడం లేదు. ఈసారి ఓటర్లు చూపు ఎటువైపు ఉంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement