మేమున్నామని.. మీకేం కాదని..

she teams bicycle tour

మహిళా పోలీసుల సైకిల్‌యాత్ర

నేడు ప్రారంభం

అతివల్లో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యం

1200 కిలో మీటర్ల పయనం

చిత్తూరు అర్బన్‌: మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలు, దాడులకు ప్రధాన కారణం, వాటిపై సరైన అవగాహన లేకపోవడమే. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి..? ఎవరిని ఆశ్రయించాలి..? ఏం చేయాలి..? అనే విషయంపై వారం క్రితం చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు జిల్లాలోని షీ టీమ్స్‌ పోలీసులు, మహిళా విభాగం పోలీసులతో సమావేశం నిర్వహించారు. మగువలపై ఇటీవల దాడులు ఎక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాధిత మహిళల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారే ఉన్నట్లు తేలింది. దీనిపై  సమస్యలు వచ్చిప్పుడు కుంగిపోకుండా నిబ్బరంగా ఉండడంతో పాటు దాన్ని పరిష్కారించుకోవడానికి మార్గాలు చూపాలన్నారు.

సైకిల్‌పై తిరుగుతూ మహిళలతో మమేకమై చైత్యన్యం తేవాలని దీనికి ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. అడగడమే ఆలస్యంగా నలుగురు యువ మహిళా కానిస్టేబుళ్లు ఆసక్తి చూపడంతో జిల్లాలో నెల రోజుల పాటు దాదాపు 1200 కిలో మీటర్ల దూరం సైకిల్‌పై తిరుగుతూ ‘అతివల్లో ఆత్మస్థైర్యం నింపుదాం..’ అనే నినాదంతో పల్లెల్లోకి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు చిత్తూరు నగరం నుంచి ప్రారంభమయ్యే ఈ సైకిల్‌ యాత్రను కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబులు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

పయనం ఇలా..
నెల రోజులకు పైగా సాగే సైకిల్‌ యాత్ర జిల్లాలో దాదాపు 1200 కిలోమీటర్లు తిరుగుతూ వెయ్యి గ్రామాల వరకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సైకిల్‌పై వెళ్లే మహిళలకు ఘన స్వాగతం పలుకుతారు. విద్యార్థినులు, మహిళా సంఘాలు, నిరక్షరాస్యులైన మహిళలతో సమావేశమవుతారు. సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రతిఘటించాలి, చట్టాలు ఏం చెబుతున్నాయి. న్యాయం ఎలా పొందాలన్న విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. అతివలపై జరిగే దాడుల నివారణకు చైతన్యం కల్పించడంతో పాటు ఆత్మహత్మ ఆలోచనల్ని చంపేయడం సమాజంలో ధైర్యంగా నిలబడటంపై కూడా మాట్లాడనున్నారు.

వీరే ఆ నలుగురు..
సైకిల్‌ యాత్రకు ఎస్పీ నలుగురు చాకుల్లాంటి మహిళా కానిస్టేబుళ్లను గుర్తించి, వీరికి ఇప్పటికే శిక్షణ సైతం ఇప్చించారు. పుత్తూరు స్టేషన్‌లో పనిచేసే తిరుమల (డబ్ల్యూపీసీ–633), బైరెడ్డిపల్లెలోని నిర్మల (డబ్ల్యూపీసీ–721),పలమనేరులోని భార్గవి(డబ్ల్యూపీసీ–676), నాగరత్న(డబ్ల్యూపీసీ–1008)ను ఎంపిక చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top