
విజయవాడ/అవనిగడ్డ /సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలంలోని అశ్వరావుపాలేనికి చెందిన పత్రికా సంపాదకుడు రేపల్లె నాగభూషణం అలియాస్ పాంచజన్య (60) విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. జర్నలిజంలో కంట్రిబ్యూటర్ నుంచి ఎడిటర్ స్థాయి వరకు ఎదిగారు. దివిసీమలో పత్రికా విలేకరిగా ఆయన జర్నలిస్టు ప్రస్థానం మొదలయ్యింది. తరువాత హైదరాబాద్ వెళ్లి మహానగర్ పత్రికను స్థాపించి సంపాదకుడిగా వ్యవహరించారు. గతకొన్ని నెలల నుంచి ఆయన ఆంధ్రపత్రిక సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాంచజన్యకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాంచజన్య మృతితో ఆయన స్వగ్రామమైన అశ్వరావుపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ వార్త తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.