విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఆందోళన ప్రారంభించాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నిర్ణయించింది.
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఆందోళన ప్రారంభించాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నిర్ణయించింది. సమ్మెతోసహ ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని ఫోరం చైర్మన్ మురళీకృష్ణ అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కేవలం సచివాలయంలో ఆందోళన చేయడంతో ప్రయోజనం కనిపించట్లేదని, విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులతో కలవాలని ఉద్యోగుల నుంచి గట్టి డిమాండ్ వచ్చింది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడానికి జరుగుతున్న యత్నాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో మద్దతు కూడగడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ వంటి నేతలకు అండగా నిల వాలని వారు కోరారు. చట్టసభల్లో పోరాడాల్సింది పార్టీలే కాబట్టి, విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీలకు నైతికంగా మద్దతు ప్రకటించాల్సిన అవసరముందన్నారు.