అతివలకు అండగా 181

Sakhi One Stop Centre Are Established In Andhra Pradesh - Sakshi

మహిళలు సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు

సమస్యలకు సత్వర పరిష్కారం

సాక్షి, నెహ్రూనగర్‌/గుంటూరు:  మహిళల సమస్యల పరిష్కారం కోసం 13 జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా సఖీ (వన్‌ స్టాప్‌ సెంటర్‌) కేంద్రాలు కొనసాగుతున్నాయి. 2016 సెప్టెంబర్‌ నుంచి మహిళలకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, వైద్య, న్యాయ, మహిళా శిశు సంక్షేమ విభాగాలతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానమై 181 కాల్‌ సెంటర్‌ పనిచేస్తుంది. కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేసే మహిళల వివరాలు ఇక్కడ  గోప్యంగా ఉంచుతారు.

మహిళలు ఫిర్యాదు చేసే అంశాలు
లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, అక్రమ సంబంధాలు, ఈవ్‌టీజింగ్, బెదిరింపులు, మహిళల అక్రమ రవాణా, సెల్‌ఫోన్‌ ద్వారా జరిపే నేరాలు, సోషల్‌ వెబ్‌సైట్‌ల ద్వారా జరిపే నేరాలు, మాదకద్రవ్యాలకు లోనై హింసించడం, ఇంటి నుంచి గెంటేయడం, పనిచేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం తదితర ఫిర్యాదులపై మహిళలు నిర్భయంగా 181కు కాల్‌ చేయవచ్చు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖీ కేంద్రంలో సోషల్‌ కౌన్సెలర్, లీగల్‌ కౌన్సెలర్లు కౌన్సెలింగ్‌ ఇవ్వడం జరుగుతుంది. అవసరం అయితే పోలీసుల సహాయం కూడా తీసుకుంటారు. 
మొత్తం 3,245 ఫిర్యాదులు గుంటూరు నగరంలో 2016 సెప్టెంబర్‌లో 181 కాల్‌ సెంటర్‌ ప్రారంభమైంది.  ఏపీకి సంబంధించిన 13 జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రారంభం నుంచి 2019 సెప్టెంబర్‌ వరకు 181కు 3,245 ఫిర్యాదులు అందాయి. వాటిలో సఖీ కేంద్రం ద్వారా పరిష్కరించిన కేసులు 2,304 అని అధికారులు చెబుతున్నారు. 

  • నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళను తన భర్త అనుమానంతో రోజు తాగి కొడుతుండటంతో చేసేదేమి లేక సదరు మహిళ 181కి కాల్‌ చేసింది. అక్కడ సిబ్బంది సఖీ కేంద్రానికి వారిని తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో వారి కాపురం  సజావుగా సాగుతోంది. 
  • గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమికులు కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండు నెలలు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత నుంచి కట్నం కోసం ఆ మహిళను అత్త, మామలతో కలిసి భర్త కూడా వేధించడంతో సదరు మహిళ 181 కాల్‌ సెంటర్‌ కాల్‌ చేసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లింది. కాల్‌ సెంటర్‌ సిబ్బంది సమస్యను సఖీ కేంద్ర దృష్టికి తీసుకెళ్లగా అక్కడ అత్త, మామ, భర్తకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ప్రస్తుతం కాపురంలో కలతలు తొలగిపోయాయి.  
  • విజయవాడలో ఓ తల్లిని ఓ సుపుత్రుడు నిత్యం తాగి కోడుతూ, తిడుతూ ఉండగా ఓపిక నశించి ఆ తల్లి 181కు కాల్‌ చేసింది. అక్కడి సిబ్బంది విజయవాడ పోలీసులకు   సమాచారం అందించి.. అతడికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు డీ–అడిక్షన్‌ సెంటర్‌ ద్వారా తాగుడు మాన్పించేందుకు మందులు వాడారు. ప్రస్తుతం ఆ యువకుడు తాగుడు మానేసి ఉద్యోగం చేసుకుంటూ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
మహిళలకు ఏ సమస్య వచ్చినా నిర్భయంగా 181కు 24/7 కాల్‌ చేయవచ్చు. కాల్‌ చేసేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆపదలో ఉన్న మహిళలు, చెప్పుకోలేని సమస్యలు ఉన్న మహిళలు 181కి ఏ సంకోచం లేకుండా కాల్‌ చేసి సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.  
– సుధారాణి, కాల్‌ సెంటర్‌  సూపర్‌వైజర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top