ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట | RTC employees announces strike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట

Dec 21 2013 2:20 AM | Updated on Sep 2 2017 1:48 AM

ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట

ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట

ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. పలు డిమాండ్లకు సంబంధించి కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయకుండా జాప్యం చేస్తుండటంతో కొద్ది రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు ఇక అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మేరకు గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లు శుక్రవారం సంయుక్తంగా ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాయి. తమ డిమాండ్లపై వెంటనే సానుకూలంగా స్పందించి అమలు చేయని పక్షంలో జనవరి 3 నుంచి సమ్మె ప్రారంభిస్తామని అందులో హెచ్చరించాయి. మరోవైపు మరో ముఖ్య కార్మిక సంఘం అయిన ఎన్‌ఎంయూ కూడా ప్రభుత్వానికి 21 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఆ గడువులోపు ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 24న సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.
 
 వెరసి ప్రధాన కార్మిక సంఘాలన్నీ సమ్మెకు సై అంటుండటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కార్మికుల ప్రధాన డిమాండ్లకు కచ్చితంగా తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. విచిత్రమైన విషయం ఏంటంటే... కార్మికులు డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలపై స్వయంగా రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదివరకే సానుకూల ప్రకటన చేసినా, ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోకపోవటంతో అవి అమలుకు నోచుకోలేదు. డిమాండ్లపై ఒప్పందం చేసుకున్నాక కూడా అమలు చేయకపోవటంతో ప్రభుత్వంపై నమ్మకం సడలిందని, దీంతో గత్యంతరం లేక సమ్మెకు సిద్ధమయ్యామని కార్మిక సంఘాల నేతలు పద్మాకర్, అశ్వద్ధామరెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఎండీగా పూర్ణచంద్రరావు ఇటీవలే బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సమ్మె నోటీసు ఇవ్వటం బాధగా ఉన్నా, తమకు తప్పని పరిస్థితి అని వారు పేర్కొన్నారు. తమ సమ్మె ప్రతిపాదనకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు మద్దతు పలకాలని వారు కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement