ఉగ్ర గోదారి..

Rising flood flow in the Godavari - Sakshi

ప్రాణహిత, శబరి, సీలేరు నదులు ఉప్పొంగడంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి

భద్రాచలం వద్ద 46.10 అడుగులకు చేరిన వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేపై రెండు అడుగుల ఎత్తున గోదావరి వరద ప్రవాహం

కాఫర్‌ డ్యామ్‌ వద్ద 28.2 అడుగులకు చేరిన జలాలు.. ముంపు గ్రామాల్లోకి వరద

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 11.10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

కృష్ణా నదిలో మరింతగా పెరిగిన వరద.. శ్రీశైలంలోకి 2.1 లక్షల క్యూసెక్కులు

ఆల్మట్టి.. నారాయణపూర్‌ల నుంచి భారీఎత్తున వరద నీరు దిగువకు విడుదల

నేడు జూరాల.. శ్రీశైలం జలాశయాలలోకి భారీగా పెరగనున్న వరద ప్రవాహం!  

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం నది పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో ఉప నదులు ప్రాణహిత, శబరి, సీలేరులు ఉప్పొంగి గోదావరి నదిలోకి పోటెత్తాయి. దాంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. వరద మట్టం భద్రాచలం వద్ద 46.10 అడుగులకు.. ధవళేశ్వరం వద్ద 11.75 అడుగులకు చేరడంతో శనివారం మధ్యాహ్నం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద నీటి మట్టం 28.20 అడుగులకు చేరింది. స్పిల్‌ వేపై రెండు అడుగుల ఎత్తున వరద ప్రవహించింది. దాంతో ముంపు గ్రామాలైన కొత్తూరు, మాదాపురంలలోకి వరద జలాలు చేరాయి. శనివారం రాత్రికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో పోలవరం వద్ద ‘హై అలర్ట్‌’ ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 11,10,953 క్యూసెక్కులను కడలిలోకి విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా ఏకధాటిగా అన్ని గేట్ల నుంచి వరద జలాలను దిగువకు విడుదల చేస్తూనే ఉన్నారు. మరోవైపు కృష్ణా నదిలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలంలోకి 2,10,140 క్యూసెక్కులు చేరడంతో నీటి మట్టం 849.6 అడుగులకు, నీటి నిల్వ 78 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి భారీ ఎత్తున వరద దిగువకు వస్తోంది. 

స్పిల్‌ వే క్రస్ట్‌ మీదుగా వరద ప్రవాహం
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను గరిష్టంగా 35 మీటర్లు.. కనిష్టంగా 22 మీటర్ల ఎత్తుతో పనులు చేశారు. ఇరువైపులా కొంత భాగం చేయకుండా వదిలేశారు. పోలవరం స్పిల్‌ వేకు 25.72 అడుగుల వద్ద గేట్లు (క్రస్ట్‌ లెవల్‌) బిగిస్తారు. స్పిల్‌ వే క్రస్ట్‌ లెవల్‌ వరకూ పనులు జరిగాయి. అయితే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ 11 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో నీటి మట్టం 28.20 అడుగులకు చేరింది. దీంతో స్పిల్‌ వే క్రస్ట్‌ లెవల్‌పై రెండు అడుగుల ఎత్తున గోదావరి వరద ప్రవహించింది. పోలవరం ముంపు గ్రామాలకు గోదావరి వరద చేరడంతో అధికారులు ఆ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. పునరావాసం కల్పించే పనులు చేపట్టారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా.. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారులకు ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మించకుండా టీడీపీ సర్కార్‌ ఎన్నికలకు ముందు హడావుడిగా కాఫర్‌ డ్యామ్‌ నిర్మించే పనులు చేపట్టడం వల్ల పోలవరం పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తుతోందని ప్రజలు వాపోతున్నారు. గతంలో వరదలు వచ్చినా ఏజెన్సీ గ్రామాల నుంచి అధికారులు ఏర్పాటు చేసిన లాంచీపై నేరుగా పోలవరం చేరుకునేవారమని, ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొత్తూరు గ్రామ సమీపంలో రహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు 

ముంపు గ్రామాల గజగజ
గోదావరి వరద ఉగ్రరూపం దాలుస్తుండడంతో ఏజెన్సీ, లంక గ్రామాల వాసులు గజగజలాడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద శనివారం రాత్రి 11 గంటల సమయంలో 13.20 అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. రాత్రికి సుమారు 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదిలే అవకాశముందని అంచనా. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లోని దేవీపట్నం, వేలేరుపాడు, కుకునూరు, పోలవరం, కూనవరం, ఏటపాక, చింతూరు, వీఆర్‌పురం మండలాల్లోని గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. చిడుమూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే దేవీపట్నం మండలం మొత్తం వరద జలాలతో నిండిపోయింది. విద్యుత్‌ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముంపు గ్రామాల్లో అనారోగ్యంతో ఉన్న వారిని, గర్భిణులను పోలవరానికి టూరిజం బోట్లలో తరలించారు. వరద ఉధృతంగా పెరుగుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు పోలవరంలోని షెల్టర్లకు తరలిరావాలని అధికారులు చెప్పినప్పటికీ వారు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు కోనసీమ కూడా వరద ముంపు బారిన పడింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, పి.గన్నవరం మండలం కనకాయిలంక, ఉడిమూడిలంక, మామిడికుదురు మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో 12 అడుగుల నుంచి 15 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది.  

నీట మునిగిన 8,947 హెక్టార్ల వరి పొలాలు
గోదావరి నదికి పోటెత్తిన వరదతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8,947 హెక్టార్ల మేర నారుమళ్లు, వరి నాట్లు వేసిన పొలాలు నీట మునిగిపోయాయి. ముంపునకు గురైన నారు ఎందుకూ పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడ్రోజుల్లో వరి చేలల్లోని నీరు బయటకు వెళ్లిపోతే నాటు మిగిలే పరిస్థితి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 412 హెక్టార్లలో నారుమళ్లు, 1,026 హెక్టార్లలో వరి పంట నీట మునిగి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 419.5 హెక్టార్లలో నారుమళ్లు, 7,091 హెక్టార్లలో వరి పంట నీట మునిగి ఉన్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ శనివారం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో వ్యవసాయాధికారులను అప్రమత్తం చేశామని, ఎప్పటికప్పుడు ఎన్యూమరేషన్‌ చేసి నష్టం వివరాలు తెలుసుకుంటున్నామన్నారు. ఆ జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడానని, టార్పాలిన్లు కావాలని కోరారని వివరించారు. ముంపునకు గురైన ప్రాంతాలలో మళ్లీ వరి నారు పోసుకునేందుకు విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారని, రైతులకు పూర్తిగా అండగా ఉంటామని, ఎవ్వర్నీ నష్టపోనివ్వబోమని స్పష్టం చేశారు.
నీటమునిగిన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామం  

అన్ని విధాలా ఆదుకుంటాం..
గోదావరి ముంపు గ్రామాల ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఆయన శనివారం వశిష్ట గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చే సరుకులతో పాటు తాను అదనంగా పది కేజీల బియ్యం పంపిణీ చేస్తానని ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని వరద పరిస్థితిపై ఆరా తీసారు. గోదావరి ముంపు గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు లాంచీలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తగు బస, భోజన ఏర్పాట్లు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top