సుంకేసుల జలాశయం నుంచి నీటిని మళ్లించుకునేందుకు పాలమూరు జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు కుట్ర చేస్తున్నారని నీటిపారుదల శాఖ ఉద్యోగుల జేఏసీ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జలమండలి కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్ : సుంకేసుల జలాశయం నుంచి నీటిని మళ్లించుకునేందుకు పాలమూరు జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు కుట్ర చేస్తున్నారని నీటిపారుదల శాఖ ఉద్యోగుల జేఏసీ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జలమండలి కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2009 వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్న జలాశయానికి ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టిందన్నారు. కరకట్టల ఎత్తు పెంచకపోవడంతో టీఎంసీకి మించి నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నామన్నారు. మరోవైపు టీబీ డ్యాంలో పూడిక పేరుకుపోతుండడంతో ఆ మేరకు రాష్ట్రం వాటా తగ్గిపోతోందన్నారు. ఈ క్రమంలో మన ప్రాంత ఆయకట్టుకే సాగునీరు సరిపోక ఇబ్బందులు పడుతుంటే ఆర్డీఎస్ కింద పాలమూరు జిల్లాలోని చివరి ఆయకట్టుకు 0.2 టీఎంసీ నీటిని మళ్లించుకునేందుకు ఆ ప్రాంత నేతలు, రైతులు కుట్ర చేస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం, హైడ్రొలాజికల్ అనుమతి అనుమతితోపాటు కర్నూలు జిల్లా ఇరిగేషన్ అధికారులతో నో అబ్జెక్షన్ పత్రాలు కూడా తీసుకున్నారన్నారు. ఈ మేరకు సీఈ, ఎస్‌ఈ గత మే 9న మహబూబ్‌నగర్ జిల్లా అధికారులకు లేఖ రాశారన్నారు. ఇదంతా జిల్లాకు చెందిన ఓ మంత్రి సిక్రెట్‌గా చేయించినట్లు తెలిసిందన్నారు. ఈ స్కీం వచ్చిందంటే కేసీ కెనాల్ ఆయకట్టు ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమైక్య ఉద్యమం తీవ్రతరం..
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఆదివారం నుంచి గ్రామస్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు ప్రచార కమిటీ కన్వీనర్‌గా వరప్రసాద్‌ను ఎంపిక చేశామని శ్రీనివాసరెడి ్డ తెలిపారు. ఈ కమిటీ వారం పాటు గ్రామాల్లో పర్యటించి రాష్ట్రం విడిపోతే ఏర్పడే సాగు, తాగునీటి సమస్యలపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఈనెల 23వ తేదీన జలమండలి ఎదుట ఇరిగేషన్ ఉద్యోగులు రక్తదాన శిబిరం ఏర్పాటు, 24న బంద్‌లు, రాస్తారోకోలు, 25న ఎండు గడ్డి తింటూ ఆర్‌ఎస్ రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన, 26వ తేదీన రాయలసీమ నీటిపారుదల శాఖ ఇంజనీర్ల కన్వీనర్ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో సదస్సు ఉంటుందన్నారు. 29న నగరంలో జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు బ్లాక్ టీషర్టులతో హాజరవుతామన్నారు.