మరో వి‘భజన’ | Rayala-Telangana I have greater authority before | Sakshi
Sakshi News home page

మరో వి‘భజన’

Aug 22 2013 2:46 AM | Updated on Sep 1 2017 9:59 PM

తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి జనం సమైక్యాంధ్ర కోసం ఉద్యమబాట పట్టగా... ఆ ఉద్యమస్ఫూర్తిని

సాక్షి ప్రతినిధి, కర్నూలు:తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి జనం సమైక్యాంధ్ర కోసం ఉద్యమబాట పట్టగా... ఆ ఉద్యమస్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్ జిల్లా నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు నుంచే రాయల తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ అంటూ అధిష్టానం ముందు కూడా భిన్న వాదనలు వినిపించిన జిల్లా కాంగ్రెస్ నేతలు ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలోనూ తమ రాజకీయ కుట్రలను మానుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణతో కలిసి ఉండటమొక్కటే మార్గమంటూ మరో విభజనను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆంటోని కమిటీ ముందు అనంతపురం జిల్లా నేతలు జేసీ దివాకర్ రెడ్డి, మధుసూదన్ గుప్తా బాహాటంగానే తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలని కోరగా, జిల్లాకు చెందిన నేతలు మాత్రం పైకి సమైక్యాంధ్ర అంటూ లోపాయికారీగా రాయల తెలంగాణకు కూడా సిద్ధమేనంటూ తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
 
 రోజుకో మాట: మంగళవారం ఆంటోని కమిటీ ముందు రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమకు రాళ్లే మిగులుతాయని చెప్పిన న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలంగాణ ప్రకటన వెలువడినప్పటి నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నా రు. ఆయనతో పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటన వెలువడిన తర్వాత ‘ఉంటే సమైక్యంగా ఉంచండి... లేదంటే మూడు ముక్కలు చేయండి’ అని అధిష్టానానికి తేల్చిచెప్పారు. జిల్లాలో విలేకరుల సమావేశాల్లోనూ ఇదే మాట చెప్పుకొచ్చారు. తెలంగాణ ఒక్క రాష్ట్రాన్నే ఇవ్వాలని కేంద్రం భావిస్తే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలనే వాదన కూడా తీసుకొచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బహిరంగంగా సమైక్య మాటలు చెబుతూ ఢిల్లీలో రాయల తెలంగాణకు లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి ఢిల్లీకే పరిమితమై తనకున్న పెద్దల సంబంధాలతో ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాయల తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాతే ఆయన కర్నూలుకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.
 
 మీటింగ్ సాకుతో దేశం విడిచిన టీజీ
 తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి భవిష్యత్ వ్యూహంపై మల్లగుల్లాలు పడుతున్న చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేశ్ ప్రస్తుత పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఏకంగా దేశాన్నే వదిలి పెట్టారు. ఓ సమావేశంలో పాల్గొనే నెపంతో ఆయన బుధవారం అమెరికా పయనమయ్యారు. వచ్చే నెల 5వ తేదీ వరకు అక్కడే ఉంటారు. కర్నూలు జిల్లాకు అన్యాయం చేసే విధంగా 72 జీవో జారీతో పాటు గుండ్రేవుల బ్యారేజీకి మోకాలడ్డుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఆయన జిల్లా వాసుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. 
 
 ఈ రెండు నిర్ణయాలపై తనకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదని ముఖ్యమంత్రిని కూడా ఆయన తప్పు పట్టారు. ఇందులో భాగంగా సీమాంధ్ర ఎమ్మెల్యేల సమావేశానికి హాజరుకాని ఆయన మంగళవారం నాటి ఆంటోని కమిటీ ముందుకు కూడా వెళ్లలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లిపోవడం గమనార్హం. మొత్తంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉద్యమం పట్ల అంటీ ముంటనట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వారిని ఎక్కడిక క్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement