కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో నాలుగురోజులుగా ఆంధ్రా-మహారాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది.
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో నాలుగురోజులుగా ఆంధ్రా-మహారాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. ఆంధ్రా జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 27 పరుగుల ఓవర్‌నైట్‌తో బరిలోకి దిగగా ఆంధ్రా బ్యాట్స్‌మన్ చివరిరోజు మ్యాచ్‌లో 90 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేశారు. జట్టులోని చిరంజీవి 12 ఫోర్లు 2 సిక్సర్‌లతో చెలరేగి ఆడటంతో సెంచరీ దిశగా సాగినా 85 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఒక ఓవర్‌లో మూడు వరుస బంతుల్లో 2ఫోర్లు 1 సిక్సర్‌తో అభిమానులను అలరించాడు.
జట్టు ఓపనర్ కేఎస్ భరత్ 24 పరుగులు, ఏజీ ప్రదీప్ 25 పరుగులు చేసి అవుటయ్యారు. లోకల్‌బాయ్ సురేష్ బాధ్యతా యుతంగా ఆడుతూ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈయనకు జతగా హరీష్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మహారాష్ట్ర జట్టు బౌలర్స్ సంక్లేచా 3, భరత్ సోలంకి, బావ్నే, దనేకర్ తలా ఒక్కో వికెట్ తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రదర్శించిన మహారాష్ట్ర జట్టుకు 3 పాయింట్లు, ఆంధ్రాకు 1 పాయింట్ దక్కింది. రంజీ మ్యాచ్ చివరి రోజు కావడం, అందునా ఆదివారం కావడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు మైదానానికి తరలివచ్చారు.