
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖ నగరానికి రానున్నారు.
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖ నగరానికి రానున్నారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రాజ్‌నాథ్ విశాఖలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న కేంద్రమంత్రి తూర్పు నౌకాదళాన్ని సందర్శిస్తారు. అనంతరం జరిగే ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో సమావేశం కోసం గురువారం హైదరాబాద్ వెళ్లిన జగన్ శనివారం అక్కడినుంచే రాత్రి ఏడుగంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.
విశాఖ విమానాశ్రయం ఆవరణలో పార్టీ శ్రేణులను, ముఖ్య అతిథులను కలిసిన అనంతరం అక్కడినుంచి రోడ్డుమార్గాన తూర్పు నౌకాదళ హెడ్‌క్వార్టర్స్‌లోని స్వర్ణ జయంతి ఆడిటోరియానికి చేరుకుని అక్కడ జరిగే ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌తో జగన్ భేటీ కానున్నారు. అనంతరం కల్వరి వద్ద ఉన్న అరిహంత్ డైనింగ్ హాల్‌లో విందులో పాల్గొంటారు. తిరుగు ప్రయాణంలో భాగంగా సీఎం జగన్ రాత్రి 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మరోవైపు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం మధ్యాహ్నం వరకు తూర్పు నౌకాదళ కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీ బయల్దేరి వెళతారు.