‘చంద్రబాబు మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మరు’

Raghuveera Reddy Comments On Chandrababu Naidu In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : ఐదు బడ్జెట్‌లు పూర్తి అయ్యేవరకు కేంద్రంతో కలిసుండి ఇవాళ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి అన్నారు. శనివారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికే నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని కడిగేస్తానని చం‍ద్రబాబు డాంబికాలు పలుకుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టిన చం‍ద్రబాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో నీతి ఆయోగ్‌ సమావేశంలో మాట్లాడతానంటే ఎలా విశ్వసించాలని​ ప్రశ్నించారు.

పెద్దనోట్ల రద్దుకు తానే ముందుగా ప్రధానికి ఉత్తరం రాశానని చెప్పిన చం‍ద్రబాబు నగదు రహిత అమలు కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించి ఇప్పుడు నోట్ల రద్దు దుష్పలితాలపై నీతి ఆయోగ్‌ సమావేశంలో మాట్లాడతానంటే ప్రజలు నమ్మరన్నారు. జీఎస్‌టీ అమలు  చేసినప్పుడు  నోరు  మెదపని  చంద్రబాబు ఇవాళ  జీఎస్‌టీ వలన  కలిగే దుష్పలితాలను  నీతి ఆయోగ్‌ సమావేశంలో  మాట్లాడతానంటే నమ్మలేమన్నారు. నాలుగేళ్లు మోదీ ప్రభుత్వంలో కలిసుండి ఒక్కసారి  కూడా  స్వామినాథన్  కమిషన్ సిఫారసులు  అమలు  చేయామని అడగని  చంద్రబాబు రైతులకు  మద్దతు ధర  పెంచాలని అడుగు తానంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం  గత నాలుగేళ్లుగా సంక్షేమ పథకాల నిధులలో  కోత విధిస్తున్నా  ఏనాడూ  ప్రశ్నించని చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి  ప్రస్తావిస్తానంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 16  మంది  ముఖ్యమంత్రులు  కలిసి లక్ష కోట్ల రూపాయల అప్పులు చేస్తే  చంద్రబాబు ఒక్కడే  నాలుగు  సంవత్సరాలలో  1 లక్షా 49  వేల కోట్ల రూపాయల  అప్పులు చేసి  రాష్ట్ర ప్రజలపై అధిక భారం మోపారని రఘువీరా ఆరోపించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top