నేను లేకున్నా... నా ఫొటో ఉండాలి | rachamallu siva prasad reddy promise Development of Proddatur constituency after ys jagan cm | Sakshi
Sakshi News home page

నేను లేకున్నా... నా ఫొటో ఉండాలి

Nov 12 2017 7:07 AM | Updated on Jul 25 2018 4:09 PM

rachamallu siva prasad reddy promise Development of Proddatur constituency after ys jagan cm - Sakshi

ప్రొద్దుటూరు : తాను లేకున్నా తన ఫొటోను అందరూ ఇంట్లో పెట్టుకునేంత గొప్పగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపిస్తున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక పుట్టపర్తి సర్కిల్‌లో శనివారం రాత్రి ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరైన పథకాలతో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, అయితే కొన్ని పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పట్టించుకోలేదన్నారు. కనీసం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదని, చుక్కనీరు కూడా ఇవ్వలేని దద్దమ్మలు పరిపాలన చేస్తున్నారని విమర్శించారు.

 పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, దోమల ప్రభావంతో తరచూ విషజ్వరాలు, డెంగీ ప్రబలి పసిబిడ్డలు మృత్యువాత పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్‌ ప్రతిష్ఠాత్మకమైన పశువైద్య కళాశాలను మంజూరు చేస్తే అందులో తాగడానికి కూడా నీరు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. నేటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. యోగివేమన ఇంజినీరింగ్‌ కళాశాల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందన్నారు. తరగతి గదులు లేక ఓ వైపు, అధ్యాపకులు లేక మరోవైపు ఇబ్బందులు పడుతున్నారని, పేరుకేమో అది యూనివర్సిటీ కళాశాలగా ఉందని అన్నారు. అపెరల్‌ పార్కు గురించి పట్టించుకునేవారే లేరన్నారు. వైఎస్‌ హయాంలోనే 350 పడకల ఆస్పత్రి, రాజీవ్‌గాంధీ నేషనల్‌ పార్కు ఏర్పాటయ్యాయన్నారు. భూగర్భ డ్రైనేజి కోసం రూ.30 కోట్లు మంజూరైనా పాలకులు పట్టించుకోకపోవడంతో పథకం ఆగిపోయిందన్నారు. 

ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి
తనకు గొప్ప ఆశలు, కోరికలు లేవని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. తాను లేకున్నా ప్రజలు గుర్తుంచుకునేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. పాతికేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజులరెడ్డి ఏమాత్రం అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బంధువులు కూడా ఇక్కడికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. భగవంతుని దయ, మీ ఆశీస్సులు ఉంటే 2019లో అధికారంలోకి వస్తామని, అప్పుడు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తానని, స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం మార్గం ఆలోచిస్తామన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ మురళీధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శులు పోరెడ్డి నరసింహారెడ్డి, జింకా విజయలక్ష్మి, మండల కన్వీనర్‌ దేవీప్రసాదరెడ్డి, సోములవారిపల్లె శేఖర్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు కసిరెడ్డి మహేష్‌రెడ్డి, లక్కిరెడ్డి పవన్‌రెడ్డి, కొవ్వూరు కృష్ణ చైతన్యరెడ్డి, మార్తల వంశీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement