నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

Rachamallu Siva prasad Reddy Couple Meet YS Jagan Mohan Reddy - Sakshi

సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే రాచమల్లు దంపతులు  

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి గత ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి శుక్రవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే సాక్షికి విషయాన్ని ఫోన్‌ ద్వారా వివరించారు. పట్టణంలోని  వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటై 12 ఏళ్లు అయినా నేటికీ అద్దె గదుల్లో నడుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సొంత భవనాలు, ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి రూ.173కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి ఐదు ప్రధానమైన డ్రైనేజీలను ఆధునీకరించాల్సి ఉందన్నారు. ఇందు కోసం రూ.80కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లో మహిళలు నడవడానికి వీలులేకుండా అసౌకర్యంగా ఉందని, దీని ఆధునీకరణకు  రూ.83కోట్లు అవసరమని చెప్పారు.

జిల్లా ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కోసం రూ.38.60కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు. పూర్వం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ పూర్తిగా దెబ్బతిందని,  ఆధునీకరణకు రూ.3కోట్లు మంజరు చేయాలని, 6వేల మంది జనాభా నివసిస్తున్న అమృతానగర్‌లో ఉన్నత పాఠశాలను నిర్మించడంతోపాటు పట్టణంలో లా కళాశాలను ఏర్పాటు చేయాలని, రూ.15కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని విన్నవించినట్లు చెప్పారు. రామేశ్వరంలోని పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఈ బ్రిడ్జిని నిర్మిస్తే రామేశ్వరం హౌసింగ్‌ కాలనీలో ఉగాది నాటికి ఇవ్వబోయే ఇళ్ల పట్టాల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సమస్యలన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.   ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టిడ్‌కో ఇళ్లు రద్దు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top