రాష్ట్ర ప్రభుత్వం బీసీల వ్యతిరేక వైఖరి అవలంభించడం వల్ల వారికోసం ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా కుంటు పడ్డాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం బీసీల వ్యతిరేక వైఖరి అవలంభించడం వల్ల వారికోసం ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా కుంటు పడ్డాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ స్టడీ సర్కిళ్లలో విద్యార్థులకు సరైన కోచింగ్ ఇవ్వడం లేదని, కార్పొరేషన్లు, ఫెడరేషన్లు రుణాలు మంజూరు చేయడం లేదని, హాస్టళ్లలో వార్డెన్, ఇతర పోస్టులు భర్తీ చేయడం లేదని దుయ్యబట్టారు. బీసీ కార్పొరేషన్, వివిధ వృత్తులకు సంబంధించి 12 ఫెడరేషన్లకు కేటాయించిన రూ.550 కోట్లు ఇంత వరకు ఖర్చు చేయలేదన్నారు.
వేలాది మంది చేతి వృత్తిదారులు, కుల వృత్తిదారులు, బీసీ వర్గాల వారు రుణాలకు దరఖాస్తులు చేసుకున్నా మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ స్టడీ సర్కిళ్ల బడ్జెట్‌ను ఉన్నతాధికారులు ఏటీఎం కార్డులుగా ఉపయోగించుకుంటూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పూర్తిగా గండికొట్టారన్నారు. రూ.35 వేల కంటే ఎక్కువ ఫీజు ఉంటే విద్యార్థులే కట్టాలనే నిబంధన విధించి ఆ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారన్నారు. బీసీల స్కాలర్‌షిప్‌లు పెంచాలని డిమాండ్ చేశారు. దాదాపు 40 పథకాల అమలును నిర్లక్ష్యం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బీసీల పురోగతిని దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని కృష్ణయ్య హెచ్చరించారు.