కల్తీ మాఫియా

కల్తీ మాఫియా - Sakshi


కల్తీకి కాదేది అనర్హం అని నిరూపిస్తోంది ఇసుక మాఫియా. అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతోంది. నిర్మాణానికి పనికిరాని సిలికాను ఏటి ఇసుక, తువ్వ మట్టితో కలిపి జనానికి శఠగోపం పెడుతోంది. నాణ్యతలేని ఇసుకతో కట్టిన భవనాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. చెన్నైలో ఇటీవల నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలేందుకు కల్తీ ఇసుకే కారణమని ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి గూడూరు సమీపంలోని

సిలికా గనులపై పడింది. 

 సాక్షి, నెల్లూరు/ సూళ్లూరుపేట: జిల్లాలోని చిల్లకూరు, కోట ప్రాంతంలో 46 వేల హెక్టార్లలో సిలికా ఖనిజం( ఓ రకమైన ఇసుక) విరివిగా లభిస్తోంది. మైనింగ్ లీజుదారులతో పాటు కొందరు అక్రమంగా సిలికాను తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వ భూముల్లోనే అక్రమంగా సిలికాను తవ్వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. సిలికా ఇసుకను పోలివున్నా నిర్మాణానికి పనికిరాదు. కంప్యూటర్‌లో వినియోగించే పరికరాలు, కొన్ని రకాల గ్లాస్ తయారీలో దీనిని వినియోగిస్తారు. వీటికి సంబంధించిన ఫ్యాక్టరీలు బెంగళూరు, పూణె, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో చెన్నైతో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో నిర్మాణ ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా తమిళనాడులో ఇసుక మైనింగ్‌పై నిషేధం ఉండడంతో అక్కడ విపరీతమైన గిరాకీ ఉంది. దీనిని ఇసుక వ్యాపారుల్లో కొందరి కన్ను సిలికాపై పడినట్టు తెలుస్తోంది.

 

 పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదుల నుంచి అక్రమంగా తవ్వుతున్న ఇసుకను రహస్య కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ సిలికాను కలిపి చెన్నై తదితర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. కొందరైతే పులికాట్ సరస్సు అంచుల్లో లభించే మట్టిని కూడా సిలికాలో కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తడ మండలంలోని కారూరు పారిశ్రామిక వాడలో సిలికా శుద్ధి కర్మాగారం ఉంది. ఆ కంపెనీలో శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలుగా బయటకు వచ్చిన ఇసుకను కంపెనీ వెనుక భాగంలో డ ంప్ చేస్తారు. దీనిని కూడా కొందరు ఇసుక వ్యాపారులు కొనుగోలు చేసి తమిళనాడులోని ఓ ప్రాంతానికి తరలించి, నదుల నుంచి సేకరించిన ఇసుకతో అక్కడ కల్తీ చేస్తున్నట్లు సమాచారం.తడకండ్రిగ అనపగుంట సమీపంలోనూ ఇలాంటి కల్తీ ఇసుక అక్రమ రవాణా కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరో కేంద్రం తమిళనాడులోని కవరైపేటై వద్ద జాతీయ రహదారిని అనుకునే వుంది. ఈ ఇసుకను మినీ లారీలు, టిప్పర్లలో లోడ్ చేసి తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల చెన్నైలోని పోరూరు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ కూలిపోయి సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణాలు పూర్తిగా వెలుగులోకి రానప్పటికీ కల్తీ ఇసుక వాడడం కూడా ఓ కారణమై ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు ఈ కల్తీ ఇసుక మాఫియాపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top