కైలాసగిరి.. పర్యాటక సిరి  | Prepared Plans For The Development Of Visakha Kailasagiri | Sakshi
Sakshi News home page

కైలాసగిరి.. పర్యాటక సిరి 

Jul 16 2020 9:58 AM | Updated on Jul 16 2020 10:02 AM

Prepared Plans For The Development Of Visakha Kailasagiri - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ నగరానికి వచ్చే ప్రతి సందర్శకుడూ కైలాసగిరి వెళ్తాడు. విదేశాల నుంచి వచ్చే 10 మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరిని సందర్శిస్తున్నారని పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. గిరిపై నుంచి సాగర నగరి సొగసులు.. వయ్యారాలు ఒలకబోస్తున్న తీరం సోయగాలు చూసేందుకు ఉవ్విళ్లూరుతారు. కొత్త ప్రాజెక్టులతో కైలాసగిరి మరింత సొబగులద్దుకోనుంది. ఇప్పటికే భారీ శివపార్వతుల విగ్రహం, శంకుచక్రనామాలు, టైటానిక్‌ వ్యూ, తెలుగు మ్యూజియం, మినీ త్రీడీ థియేటర్, రోప్‌వే.. కొండ చుట్టూ తిరుగుతూ విశాఖ అందాలు చూపించే రైలు బండితో కళకళలాడుతున్న కైలాసగిరిపై రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 380 ఎకరాల్లో అభివృద్ధి పనులకు వీఎంఆర్‌డీఏ శ్రీకారం చుడుతోంది.

సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాసగిరిపై నుంచి విశాఖను చూస్తే సుందరంగా కనిపిస్తుంది. అందుకే ఈ పర్యాటక ప్రాంతానికి క్రేజ్‌ ఉంది. మరిన్ని కొత్త ప్రాజెక్టులతో దేశ, విదేశీ సందర్శకులను ఆకర్షించేలా వీఎంఆర్‌డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రీస్టోరేషన్‌ అండ్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద రూ.61.93 కోట్లతో 380 ఎకరాల కైలాసగిరి హిల్‌ టాప్‌ పార్కును అభివృద్ధి చేయనుంది. ముఖద్వారం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనుంది. దీనికి తోడు కియోస్క్‌లు, ఫుడ్‌కోర్టులు, అ«ధునాతన టాయిలెట్స్‌ ఏర్పాటు చేయనుంది. ల్యాండ్‌ స్కేప్‌ వర్క్స్, పాత్‌వేలు, వ్యూపాయింట్స్‌ అభివృద్ధి చేయనుంది. సరికొత్త విద్యుత్‌ దీపాలంకరణతో పాటు పర్యాటకులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. అలాగే కొండపై ఉన్న 7ఎకరాల్లో రూ.37కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 3 ప్లానిటోరియం ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్‌ కూడా సిద్ధం చేస్తోంది. మొత్తంగా అన్ని విధాలా కైలాసగిరిని అభివృద్ధి చేసి ప్రస్తుతం వచ్చిన పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని వీఎంఆర్‌డీఏ భావిస్తోంది.

 

రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణం 
ఆంధ్రప్రదేశ్‌ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు(ఏపీడీఆర్‌పీ) కింద ప్రపంచ బ్యాంకు అందిస్తున్న నిధులతో కైలాసగిరిని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు వీఎంఆర్‌డీఏ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం కైలాసగిరికి ఒక ఘాట్‌రోడ్డు ఉంది. దీనికి అనుగుణంగా మరో ఘాట్‌ రోడ్డుని ఆధునిక సౌకర్యాలతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 800 మీటర్ల పొడవుతో ఈ ఘాట్‌ రోడ్డు నిర్మించనున్నారు. ఏపీడీఆర్‌పీ నిధుల్లో 8.97 కోట్లతో రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న ఘాట్‌ రోడ్డును అభివృద్ధి చెయ్యనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ కూడా సిద్ధమవుతోంది. మొత్తం మీద మరో ఏడాది కాలంలో కైలాసగిరిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు వీఎంఆర్‌డీఏ సమగ్ర కార్యచరణతో ముందుకెళ్తోంది.

రెండో ఘాట్‌ రోడ్డు నమూనా 

పర్యాటకంలో ప్రధానాకర్షణగా... 
అన్ని హంగులతో కైలాసగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ సందర్శకుల అభిరుచులకు తగ్గట్లుగా ఫుడ్‌కోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని రకాల చర్యలకు ఉపక్రమిస్తున్నాం. 3డీ ప్లానిటోరియం ప్రాజెక్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇవన్నీ పూర్తయితే దేశీయ పర్యాటకంలో కైలాసగిరి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 
– పి.కోటేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement