అధికార పార్టీ  కొత్త ఎత్తులు

Postal Ballot Issue In Darshi - Sakshi

పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీలో అక్రమాలు

టీడీపీ మద్దతుదారులకే అందజేత

చర్చనీయాంశమైన డబుల్‌ బ్యాలెట్‌ వ్యవహారం

సాక్షి, దర్శి(ప్రకాశం): ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది సర్వసాధారణం. కానీ, దర్శి ఎన్నికల అధికారులు మాత్రం టీడీపీ మద్దతుదారులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కరికి రెండు పోస్టల్‌ బ్యాలెట్లు ఇస్తున్నారు. ఈ విషయం దర్శి నియోజకవర్గంలో మంగళవారం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో మొత్తం 1,864 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లున్నాయి. వివిధ రకాల ఎన్నికల డ్యూటీలకు నియమించిన అధికారులకు వాటిని కేటాయించారు. కాగా, ఇతర నియోజకవర్గాల్లో ట్రైనింగ్‌ తీసుకున్న అధికారులు కొందరు అక్కడే పోస్టల్‌ బ్యాలెట్లు పొందారు.

గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు. ట్రైనింగ్‌ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చిన దాఖలాలే లేవు. నియోజకవర్గం హెడ్‌క్వార్టర్‌లోని ఆర్వో కార్యాలయం నుంచి మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చేవారు. కానీ, ఈసారి మాత్రం ఇక్కడి నుంచి ఇతర నియోజకవర్గాలకు ట్రైనింగ్‌కు వెళ్లిన అధికారులు అక్కడి ట్రైనింగ్‌ సెంటర్‌లోనే పోస్టల్‌ బ్యాలెట్లు తీసుకున్నారు. కానీ, వారిలో కొంత మందికి మళ్లీ ఇక్కడి ఆర్వో కార్యాలయం నుంచి పోస్టు ద్వారా పోస్టల్‌ బ్యాలెట్లు పంపినట్లు సమాచారం. ఈ విధంగా ప్రభుత్వ హైస్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ పీఈటీ, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఓ సీనియర్‌ అసిస్టెంట్, ఎన్‌ఎస్పీ డిపార్ట్‌మెంట్‌లోని ఓ ఉద్యోగి, మరికొందరు ఇంజినీరింగ్‌ విభాగం, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్లు వెళ్లినట్లు సమాచారం.

వారు ఇప్పటికే ట్రైనింగ్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్లు పొంది ఉన్నారు. ఈ విధంగా ఒక్కో ఉద్యోగి రెండు పోస్టల్‌ బ్యాలెట్లు పొందినట్లు తెలిసింది. జిల్లా మొత్తం ఇదే విధంగా జరుగుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం. కాగా, కేవలం అధికార పార్టీ మద్దతుదారులైన ఉద్యోగులకే ఈ విధంగా రెండేసి పోస్టల్‌ బ్యాలెట్లు అందినట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పటికే బయటకు వచ్చినప్పటికీ ఎన్నికల అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి డబుల్‌ పోస్టల్‌ బ్యాలెట్లపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఒక్కొక్కరు ఒక పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా మాత్రమే ఓటేసేలా చూడాలని డిమాండ్‌ వినిపిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top