రాష్ట్ర విభజనకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావులు తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టించింది.
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావులు తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టించింది. శనివారం ఉదయం వీరిద్దరూ చేపట్టబోయిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వారి వారి ఇళ్ల వద్ద ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నా కొద్దిసేపటికే సర్దుకున్నాయి. దేవినేని ఉమాతోపాటు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని), అర్బన్ అధ్యక్షుడు నాగుల్‌మీరాలను పోలీసులు అరెస్టుచేసి మాచవరం పోలీసుస్టేషన్‌కు తరలించగా, బొండా ఉమాను పటమట పీఎస్‌కు తరలించారు.
దీక్ష కొనసాగింపులో భిన్నాభిప్రాయాలు..
మాచవరం పోలీసుస్టేషన్‌కు చేరుకున్న నేతలకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. స్టేషన్ ఎదుట కొద్దిసేపు నిరసన ప్రదర్శనలు నిర్వహించిన తరువాత స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్లిపోయేందుకు నేతలు సమాయత్తమయ్యారు. దీనికి దేవినేని ఉమా అంగీకరించలేదు. తాను పోలీసుస్టేషన్‌లోనే దీక్ష కొనసాగిస్తానంటూ పట్టుబట్టారు. దీనిపై కేశినేని నాని, నాగుల్‌మీరా, బుద్దా వెంకన్న తదితరులు చర్చలు జరిపారు. ప్రస్తుతం అవనిగడ్డ ఉపఎన్నిక కోడ్ అమలులో ఉన్నందునే పోలీసులు అరెస్టు చేశారని, ఇప్పుడు స్టేషన్‌లోనే ఆమరణదీక్షకు దిగితే కోడ్ ఉల్లంఘన అవుతుందని, అందువల్ల స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్లిపోవడం మం చిదని నిర్ణయించుకున్నారు.
ఆ మేరకు వారంతా బెయిల్ తీసుకుని వెళ్లిపోయారు. వారితో విభేదించిన ఉమా మాత్రం రాత్రి వరకు స్టేషన్‌లోనే బైఠాయించి హైడ్రామా సృష్టించారు. పటమట పోలీసుస్టేషన్‌లో ఉన్న బొండా ఉమా కూడా ఎన్నికల నిబంధనలకు లోబడే మధ్యాహ్నమే స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్లిపోయారు. దేవినేని ఉమా వైఖరితో విసుగు చెందిన పోలీసులు ఆయన్ను బలవంతంగా ఇంటి వద్దకు తీసుకువెళ్లి వదిలివేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఆమరణదీక్ష హైడ్రామాపై ఆ పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి.
ఉదయం నుంచీ హడావుడే!
ఆమరణ నిరహారదీక్షకు సిద్ధమైన దేవినేని ఉమా ను గృహ నిర్బంధం, గొల్లపూడిలోనే అరెస్టు చేస్తారంటూ శుక్రవారం అర్ధరాత్రి నుంచే జోరుగా ప్రచారం జరిగింది. శనివారం ఉదయం గొల్లపూడిలోని ఆయన ఇంటికి చేరిన మీడియాతో ఆయన గదిలోనే కటకటాల వెనుక నిలబడి మాట్లాడారు. అయితే ఆయన్ను గొల్లపూడిలో అరెస్టు చేయబోరని పోలీసులు స్పష్టం చేయడంతో చివరకు బయటకు వచ్చి విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. మధ్యలో ఏదైనా కారు ఎక్కి మాయమై దీక్షాస్థలి వద్దకు చేరుకుంటారేమో అనుమానించిన పోలీసులు గొల్లపూడి నుంచి విజయవాడ వైపు వచ్చే ప్రతి వాహనాన్ని సోదా చేశారు. ఉమా పక్కన కూడా మఫ్టీలో పోలీసుల్ని ఉంచారు. ఆయన విజయవాడ సరిహద్దులోకి రాగానే అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంటసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.