హింసానందం.? ఓ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌లో అధికారి ఇష్టారాజ్యం

Police Officer in a Circle Police Station is Preferred in Vijayawada - Sakshi

మామూళ్ల వసూళ్లకు ప్రత్యేక టీమ్‌ 

చీటికీమాటికి సిబ్బందిపై తిట్లదండకం

ఓ కానిస్టేబుల్‌తో తన కుమారుడికి ట్యూషన్‌

డివిజన్‌ అధికారితో వివాదాలు

వీరిద్దరి ధాటికి సెలవులో వెళ్లిన ఇద్దరు ఎస్‌ఐలు 

సాక్షి, అమరావతిబ్యూరో : బెజవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పలువురు పోలీసు అధికారులు గాడి తప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తూ.. సొంత లాభం చూసుకుంటూ కాసుల వేటకు తెరలేపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

విజయవాడ తూర్పు డివిజన్‌లో ఓ సర్కిల్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారి కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. మామూళ్లు దండుకోవడానికి ఓ ప్రత్యేక టీమ్‌నే ఏర్పాటు చేయడంపై పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజాయితీగా పనిచేస్తున్న కిందస్థాయి సిబ్బందిపై చిరుబుర్రులాడటం.. నెలవారీ టార్గెట్లు విధించడంతో ఈ పోరు తట్టుకోలేక.. ఆయన కింద పనిచేస్తోన్న ఇద్దరు ఎస్‌ఐలు సెలవులో వెళ్లినట్లు సమాచారం.
బెజవాడకు కూతవేటు దూరంలో ఉంటుందా సర్కిల్‌ స్టేషన్‌. ఆ సర్కిల్‌ పరిధిలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటి పర్యవేక్షణ బాధ్యతలు చూసే సీఐ ఆయా స్టేషన్లకు వస్తున్నారంటే అక్కడ పనిచేసే సిబ్బందికి చెమటలు పడుతున్నాయి. వచ్చీరావడంతోనే ఆయన అందుకునే తిట్లదండకానికి బెంబేలెత్తాల్సిన పరిస్థితి.

చీటికిమాటికి ఆయన స్టేషన్లకు వచ్చి.. సిబ్బందిని చులకనచేసి మాట్లాడటం.. సాటి అధికారులపైనా సూటిపోటి మాటలతో హింసించడం పరిపాటిగా మారింది. ఇక ఆయన వచ్చిన సమయంలో స్టేషన్‌ వద్ద గుంపులు గుంపులుగా ప్రజలు కనిపిస్తే మాత్రం సిబ్బందిపై శివాలెత్తిపోతారు. గతంలో ఆ అధికారి పనిచేసిన స్టేషన్లలో ఇదేవిధంగా వ్యవహరించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినట్లు సమాచారం.

సీఐ కింద ముగ్గురు ఐడబ్ల్యూలు.. ఓ ఏఎస్‌ఐ!
సాధారణంగా ప్రతి స్టేషన్‌లోనూ ఓ హెడ్‌కానిస్టేబుల్, సీఐ కింద ఇన్‌స్పెక్టర్‌ రైటర్‌(ఐడబ్ల్యూ)గా పనిచేస్తుంటారు. కానీ ఈయన మాత్రం ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లను పెట్టుకున్నారు. వీరితోపాటు గతంలో రైటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఓ కానిస్టేబుల్‌ను సైతం అతనికి సహాయకుడిగా తీసుకున్నారు.

నెలవారీ మామూళ్లు ఎవరెవరి నుంచి వస్తాయి.. వసూళ్లు ఎలా చేస్తారు.. వంటి అంశాలపై ఆ కానిస్టేబుల్‌కు బాగా అవగాహన ఉండటంతోనే ఆయనను తన వద్ద నియమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మరో స్టేషన్‌లో పనిచేస్తోన్న ఓ ఏఎస్‌ఐను సైతం సీఐ సర్కిల్‌ స్టేషన్‌లో వివిధ పనులకు అనధికారికంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది. సర్కిల్‌ స్టేష¯Œలో పనిచేసే సిబ్బంది ఇప్పుడు ఏఎస్‌ఐకు సైతం బయపడాల్సిన పరిస్థితి వచ్చింది.

అతను రోజువారీగా స్టేషన్‌ పరిధిలో కేసుల నమోదు, పర్యవేక్షణ తదితర పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆ స్టేషన్‌ పరిధిలోని ఓ దుకాణంలో పనిచేసే గుమాస్తా ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను చేసిన అప్పును ఎప్పుడు తీరుస్తారని యజమాని ప్రశ్నించినందుకే ఆ గుమాస్తా ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసి.. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు వినికిడి. 

కానిస్టేబుల్‌తో కుమారుడికి ట్యూషన్‌.. 
తన స్టేషన్‌లో పనిచేస్తోన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌ను ఇంటర్మీడియెట్‌ చదివే తన కుమారుడికి ట్యూషన్‌ చెప్పే పనులకు వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇంజినీరింగ్‌ చదివిన కానిస్టేబుల్‌కు ఇప్పుడు అతనికి ట్యూషన్‌ చెప్పడమే డ్యూటీగా మారింది. ఆయనకు మరో డ్యూటీలేవీ వేయకుండా సీఐ ఇంటివద్దే పనులు చేయించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. 
ఇద్దరు అధికారుల 

మధ్య నలిగిపోతున్న ఎస్‌ఐలు.. 
సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేధింపులతో సతమతవుతున్న ఎస్‌ఐలకు.. డివిజన్‌ స్థాయి ఉన్నతాధికారితోనూ తలనొప్పిగా మారింది. ఒకవైపు చీటికిమాటికి సీఐ చీవాట్లు పెడుతుండటం.. మరోవైపు డివిజన్‌స్థాయి అధికారి పెండింగ్‌ ఫైళ్లు చూసే పేరిట చులకనభావంతో మాట్లాడటంతో ఎస్‌ఐలు ఆ సర్కిల్‌లో పనిచేయడం కన్నా.. ఎక్కడైనా సెక్యూరిటీగార్డుగా పనిచేసుకోవడం మేలని బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి.

 సీఐ దెబ్బకు సెలవుపై వెళ్లి ఇటీవలే విధుల్లో చేరిన ఓ ఎస్‌ఐ రెండు రోజులు తిరక్కముందే మళ్లీ సెలవుపై వెళ్లిపోయారు. మరో ఎస్‌ఐది ఇదే పరిస్థితి. గతంలో ఆయనపై సీఐ ఆగ్రహంగా సెల్‌ఫోన్‌ విసిరివేయడంతో మనస్తాపం చెంది సెలవుపై వెళ్లిపోయాడు. ఇటీవలే విధుల్లో చేరాడు. 

పై అధికారులకు సమాచారం నిల్‌!
ఆ సర్కిల్‌ పరిధిలో ఇంత జరుగుతున్నా.. సమాచారం కమిషనరేట్‌ పరిధికి చేరకపోవడం విడ్డూరం. ఇక్కడ స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగి వాటిని తొక్కిపెట్టడం వల్లే పైస్థాయి అధికారులకు ఇక్కడి విషయాలేవీ తెలియడం లేదని సిబ్బంది నుంచి సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top