ఢిల్లీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి ఒక్కరూ టీ వీలకు అతుక్కొని పోతున్నారు.
అందరి చూపూ హస్తిన వైపే
సమైక్యవాదుల కదలికలపై పోలీసుల నిఘా
ఆర్ట్స్ కళాశాల హాస్టల్ చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు
సాక్షి, అనంతపురం :
ఢిల్లీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి ఒక్కరూ టీ వీలకు అతుక్కొని పోతున్నారు. పార్లమెంటులో ఎలాంటి నిర్ణయం వస్తుందో అనే ఆత్రుతతో సమావేశాలు ముగిసే వరకు పలువురు పనులకు కూడా వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉంటున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తేనే విభజన బిల్లుకు మద్దతు ఇస్తామని బీజేపీ నేతలు ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారనే విషయమై అందరి చూపూ పార్లమెంటు వైపే ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏపీఎన్జీఓల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడంతో సోమవారం ఢిల్లీని వేడెక్కించినట్లైంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో ముందుకెళ్లే సాహసం చేయకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. మరోవైపు విభజన బిల్లును ఏదో ఒక విధంగా గట్టెక్కించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ దూకుడు పెంచుతుండ టంతో ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. విభజనకు కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి గట్టిగా సమైక్యవాదాన్ని విన్పించారు. మరో వైపు సేవ్ డెమోక్రసీ...సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఎపీఎన్జీఓలు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
సీమాంధ్ర ప్రాంతానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదనే రీతిలో ఇటు ప్రజా ప్రతినిధులు అటు ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నా ఇవేమీ పట్టనట్లుగా తెలంగాణ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం తన దూకుడును పెంచింది. ఇందులో భాగంగానే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడిని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేయడం.. ఆ తర్వాత పలువురు బీజేపీ నాయకులతో కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ చర్చలు జరిపి విభజనకు మద్దతు ఇవ్వాలని కోరడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యంగా జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల వారు మొదట్నుంచి ఆందోళనలు చేయడంలో ముందుంటూ వస్తున్నారు.
‘అనంత’లో సమైక్యవాదుల పోరుతోనే సీమాంధ్రలో ఆందోళన ఊపందుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పదవులను కాపాడుకునేందుకు అధిష్టానంపై ఒత్తిడి తీసుకరావడంలో విఫలమవుతున్నారు. విభజనకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తేవడంలో ఈ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. అన్యాయం చేస్తున్న అధిష్టానాన్ని నిలదీయడంలో కాంగ్రెస్ నేతలు వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో సామాన్యులే రోడ్లపైకొచ్చి తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని ఊర్రూతలూగించారు. ఈ స్థితిలో పార్లమెంటులో బిల్లుపై చర్చ జరిగితే.. ఆందోళనలు మరింత ఉధృతం అయ్యే పరిస్థితులు ఉన్నాయని భావించి పోలీసులు నిఘా పెంచారు.
ఇందులో భాగంగానే అనంతపురం ఆర్ట్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు దూకుడు పెంచకుండా ముందు జాగ్రత్త చర్యగా సోమవారం నుంచి హాస్టల్ ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కూడా విద్యార్థుల కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.