breaking news
Samaikyandhra supporters
-
ఏమవుతుందో!
అందరి చూపూ హస్తిన వైపే సమైక్యవాదుల కదలికలపై పోలీసుల నిఘా ఆర్ట్స్ కళాశాల హాస్టల్ చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు సాక్షి, అనంతపురం : ఢిల్లీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి ఒక్కరూ టీ వీలకు అతుక్కొని పోతున్నారు. పార్లమెంటులో ఎలాంటి నిర్ణయం వస్తుందో అనే ఆత్రుతతో సమావేశాలు ముగిసే వరకు పలువురు పనులకు కూడా వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉంటున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తేనే విభజన బిల్లుకు మద్దతు ఇస్తామని బీజేపీ నేతలు ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారనే విషయమై అందరి చూపూ పార్లమెంటు వైపే ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏపీఎన్జీఓల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడంతో సోమవారం ఢిల్లీని వేడెక్కించినట్లైంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో ముందుకెళ్లే సాహసం చేయకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. మరోవైపు విభజన బిల్లును ఏదో ఒక విధంగా గట్టెక్కించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ దూకుడు పెంచుతుండ టంతో ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. విభజనకు కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి గట్టిగా సమైక్యవాదాన్ని విన్పించారు. మరో వైపు సేవ్ డెమోక్రసీ...సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఎపీఎన్జీఓలు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదనే రీతిలో ఇటు ప్రజా ప్రతినిధులు అటు ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నా ఇవేమీ పట్టనట్లుగా తెలంగాణ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం తన దూకుడును పెంచింది. ఇందులో భాగంగానే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడిని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేయడం.. ఆ తర్వాత పలువురు బీజేపీ నాయకులతో కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ చర్చలు జరిపి విభజనకు మద్దతు ఇవ్వాలని కోరడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యంగా జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల వారు మొదట్నుంచి ఆందోళనలు చేయడంలో ముందుంటూ వస్తున్నారు. ‘అనంత’లో సమైక్యవాదుల పోరుతోనే సీమాంధ్రలో ఆందోళన ఊపందుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పదవులను కాపాడుకునేందుకు అధిష్టానంపై ఒత్తిడి తీసుకరావడంలో విఫలమవుతున్నారు. విభజనకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తేవడంలో ఈ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. అన్యాయం చేస్తున్న అధిష్టానాన్ని నిలదీయడంలో కాంగ్రెస్ నేతలు వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో సామాన్యులే రోడ్లపైకొచ్చి తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని ఊర్రూతలూగించారు. ఈ స్థితిలో పార్లమెంటులో బిల్లుపై చర్చ జరిగితే.. ఆందోళనలు మరింత ఉధృతం అయ్యే పరిస్థితులు ఉన్నాయని భావించి పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగానే అనంతపురం ఆర్ట్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు దూకుడు పెంచకుండా ముందు జాగ్రత్త చర్యగా సోమవారం నుంచి హాస్టల్ ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కూడా విద్యార్థుల కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. -
జగన్ అరెస్ట్ అక్రమం
రాష్ట్ర విభజనకు నిరసనగా ఢిల్లీలో ‘సమైక్య వాక్’ చేపట్టిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం తగదని పలు సంఘాల నేత ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అక్రమ అరెస్టుల ద్వారా ‘సమైక్య’ ఉద్యమాన్ని ఆపలేదని స్పష్టం చేశారు. అణచివేయాలని చూస్తే ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడుతుందని హెచ్చరించారు. - న్యూస్‌లైన్, అనంతపురం టౌన్ పక్షపాత ధోరణికి నిదర్శనం సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్, ఎన్జీఓ నేత అశోక్‌బాబు కూడా దీక్ష చేపట్టారు. వారెవర్నీ అరెస్ట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాత్రమే అరెస్టు చేయించడం పక్షపాత ధోరణికి నిదర్శనం. దీన్ని సమైక్యవాదులంతా ఖండించాలి. - రమణారెడ్డి, జాక్టో కన్వీనర్ నిరసన తెలపడం తప్పా? సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని కేంద్రం గుర్తించుకోవాలి. ఒక పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అయిన జగన్మోహన్రెడ్డి నిరసన వ్యక్తం చేయడం తప్పా? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకా నియంతృత్వమా? అరెస్ట్‌లు చేసి రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. - నరసింహులు, విద్యా జేఏసీ కన్వీనర్ హేయమైన చర్య జగన్‌ను అరెస్ట్ హేయమైన చర్య. ఈ రోజు జగన్ అరెస్ట్, మొన్న ఎంపీల బహిష్కరణను చూస్తే కేంద్రం కావాలనే సీ మాంధ్ర ప్రజాప్రతినిధుల పట్ల ఇ లాంటి ధోరణిని అవలంబిస్తోంది. రాష్ర్టం బచావో అంటూ వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తోంటే.. కాంగ్రెస్ బచావో అంటూ సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హైదరాబాద్ సమావేశాలు నిర్వహించడం విడ్డూరం. - రమేష్‌బాబు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అక్రమ అరెస్ట్‌తో ఉద్యమాన్ని ఆపలేరు వైఎస్ జగన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్ట్‌లతో సమైక్య వాదాన్ని అణచాలని చూస్తే అంతకు రెట్టింపు స్థాయిలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది. కేంద్రం ఇప్పటికైనా ప్రజా ఉద్యమానికి తలొగ్గి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయాలి. లేదంటే ఢిల్లీ వీధులు దద్దరిల్లేలా మరిన్ని ఆందోళనలు చేపడతాం. - ఫరూక్అహమ్మద్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఖండిస్తున్నాం.. వైఎస్ జగన్ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడం అభినందనీయం. ఆయ న్ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నాం. తెలు గు ప్రజల మధ్య చిచ్చు పెట్టిన కాంగ్రెస్‌ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం. సమైక్యాంధ్ర కోసం పనిచేస్తున్న ఏ పార్టీకైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. - సంపత్‌కుమార్, విద్యుత్ జేఏసీ చైర్మన్ అరెస్టు తగదు ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా నిరసన తెలియజేసే హక్కు ను రాజ్యాంగం కల్పిం చింది. ఢిల్లీలో సమైక్యవాణి విన్పిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం తగదు. ఈ అరెస్టును ప్రజాస్వామ్య వాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. - రాచంరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీఆర్జేఏసీ చైర్మన్ జగన్ అరెస్ట్ దారుణం వైఎస్ జగన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం దారుణం. కేంద్ర ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేదు. ఉద్యమాన్ని పెద్దఎత్తున ముందుకు తీసుకెళుతున్న జగన్... కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో చేపట్టిన దీక్షను భగ్నం చేయడం హేయమైన చర్చ. యూపీఏ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, బెదిరింపులకు దిగినా ఉద్యమాన్ని అడ్డుకోలేదు. - దేవరాజు, ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు -
సీఎం కిరణ్‌పై సమైక్యవాదుల మండిపాటు
తిరుపతి : ఓవైపు ఢిల్లీలో రాష్ట్ర విభజనపై వేగంగా పావులు కదులుతుంటే - ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం శుభకార్యాలకు, దేవాలయాల చుట్టు తిరుగుతున్నారని సమైక్యవాదులు మండిపడుతున్నారు. విభజన కీలక సమయంలో చిత్తురు జిల్లాలోని ఓ వివాహ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడాన్ని వారు తప్పుబట్టారు. పీలేరుకు చెందిన కాంగ్రెస్ నేత కుమార్తె వివాహానికి కిరణ్ గురువారం తిరుపతికి విచ్చేశారు. తర్వాత ఆయన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వెలుపలికి వస్తుండగా కొంతమంది భక్తులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అయితే సీఎం మాత్రం స్పందించకుండా వెళ్లిపోయారు. ఇక సీఎం తిరుపతి పర్యటన సందర్భంగా కొంతమంది పార్టీ కార్యకర్తలు మాత్రమే రేణుగుంట విమానాశ్రయం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పలువురు నేతలు డుమ్మా కొట్టారు. తిరుపతి పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి హైదరాబాద్ బయల్దేరారు. -
సడలని దీక్ష.. సమైక్య రక్ష
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సమైక్యవాదులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ధర్నాలు.. రాస్తారోకోలు.. మానవహారాలతో పాటు ఆమరణ దీక్షలకూ వెనకడుగు వేయకపోవడం వారి పోరాటస్ఫూర్తికి నిదర్శనం. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం.. ప్రభుత్వ వైద్యులు విధులు బహిష్కరించడంతో సమైక్య ఉద్యోమం మహోద్ధృతమవుతోంది. సోమవారం సుంకేసుల జలాశయం వద్ద చేపట్టిన రైతు శంఖారావం రైతులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. మాజీ ఎంపీపీ విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే బ్యారేజీ పైకి వెళ్లకుండా కేసీ కెనాల్ గట్టుపై సభ జరుపుకోవాలని పోలీసులు సూచించడంతో రైతులు ససేమిరా అన్నారు. జలాశయంపైనే సభ జరిపి తీరుతామని ముందుకు కదలడంతో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లను తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సమయంలో కొందరు రాళ్లు, చెప్పులు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పోలీసు అధికారులు ఎస్పీతో చర్చించి జలాశయంపై 13వ గేటు వరకు వెళ్లేందుకు అనుమతివ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇక విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో ఆదివారం జిల్లా అంధకారంలో మగ్గడం తెలిసిందే. సోమవారం కూడా శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా కేబినెట్ తీర్మానానికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు విధులను బహిష్కరించారు. ఫలితంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్లు వాయిదా పడ్డాయి. రోజూ సుమారు 1500 మంది వరకు చికిత్స నిమిత్తం వచ్చే ఆసుపత్రి ఓపీ బోసిపోయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్యులంతా కలెక్టరేట్ కూడలిలో భారీ మానవహారం నిర్వహించడంతో రాకపోకలు స్తంభించాయి. నగరంలో పలుచోట్ల సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. నంద్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆలూరులో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో బొత్స, సోనియా వేషధారులు చీరలు కట్టుకుని ర్యాలీ చేశారు. వీరికి కూరగాయల దండ వేసి చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు పట్టణంలో ర్యాలీ చేపట్టి భీమాస్ కూడలిలో మానవహారం నిర్వహించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా రాస్తారోకో చేపట్టారు. అధ్యాపక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. డోన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కోవెలకుంట్లలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేసి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కోసిగిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పత్తికొండలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కోడుమూరు, లద్దగిరి, గూడూరు, పోలకల్లుకు చెందిన వైద్యులు సోనియా దిష్టిబొమ్మకు పోస్టుమార్టం చేసి గుండె, బ్రెయిన్ లేదని తేల్చారు. నందవరంలో సమైక్యవాదులు ఎమ్మిగనూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆత్మకూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేయడంతో రాకపోకలు స్తంభించాయి. -
బొత్స ఇంటిపై దాడికి యత్నం, టియర్ గ్యాస్ ప్రయోగం
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో తీవ్రస్థాయిలో జరుగుతున్నఉద్యమం రణరంగాన్ని తలపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యమకారులు శనివారం మరోసారి బొత్స ఇంటిపై దాడికి యత్నించారు. పట్టణంలోని జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయాన్ని తగులబెట్టడంతో మంటలు చెలరేగాయి. ఆందోళనకారుల్ని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సమైక్యవాదులు పోలీసులపై రాళ్లు రువ్వరు. ఈ సంఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఎనిమిది బైకులు, మూడు పోలీసులు జీపులు ధ్వంసమయ్యాయి. -
అనంతపురంలో తెలంగాణకు పాస్‌పోర్ట్ కేంద్ర కార్యాలయం
-
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ
జేఎన్టీయూ, న్యూస్‌లైన్ : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూలో సోమవారం నిర్వహించాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను సమైక్యవాదులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. పాలిటెక్నిక్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహణకు సిబ్బం ది ఎవరూ హాజరుకాలేదు. ప్రిన్సిపాల్ సూర్యనారాయణ విద్యార్థులతో ర్యాంకు కార్డులు తీసుకుని, ఉన్నతాధికారులతో సంప్రదించిన తర్వాత కౌన్సెలింగ్ తేదీని ప్రకటిస్తామన్నారు. అంతకుముందు విద్యార్థులు కౌన్సెలింగ్ కేం ద్రంలోకి వెళుతుండగా ఆగ్రహించిన సమైక్యవాదులు కౌన్సెలింగ్ కేంద్రానికి తాళం వేసి, వారిని అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ తప్పకుండా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 7 గంటలకే కౌన్సెలింగ్ కేం ద్రం వద్దకు చేరుకున్నారు. కేంద్రంలో సిబ్బం ది ఎవరూ లేకపోగా కేవలం ప్రిన్సిపాల్ ఒక్కరే ఉన్నారు. ఎలాగైనా కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు వారు కేంద్రంలోకి వెళ్తుండగా సమైక్య వాదులు అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వీలులేదని అందరూ వెన క్కు పోవాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు, సమైక్య ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుతోందని, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తుండగా కౌన్సెలింగ్‌కు ఎందుకు హాజరయ్యారని పాలిటెక్నిక్ సిబ్బం ది, ఉద్యోగులు, ఆందోళనకారులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నిలదీశారు. వీరి మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. కళాశాల సిబ్బంది, ఆందోళనకారు లు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులు మోకాళ్లపై కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్సై జాకీర్ హుసేన్ కళాశాల వద్దకు చేరుకున్నారు. సమైక్యవాదులతో చర్చించారు. ప్రిన్సిపల్ సూర్యనారాయణరెడ్డిని పిలిపించి కౌన్సెలింగ్ జరుగుతుందా?లేదా? తర్వాత ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాలన్నారు. ప్రిన్సిపాల్ సమాధానమిస్తూ పాలిటెక్నిక్ టీచింగ్ స్టాఫ్ సమ్మెలో ఉన్నారన్నారు. నాన్టిచింగ్ సిబ్బంది కూడా సమ్మె నోటీసు ఇచ్చారన్నారు. సిబ్బంది లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం అసాధ్యమన్నారు. అధికారులను సంప్రదించి తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్‌కు తెలిపేందుకు విద్యార్థుల నుంచి ర్యాంకు కార్డులను తీసుకున్నామన్నారు. వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, తిరిగి విద్యార్థులకు అందచేస్తామని ప్రిన్సిపాల్ వివరించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులను, తల్లిదండ్రులను సీఐ వెనక్కు పంపారు వర్సిటీలో అడ్మిషన్ల కార్యాలయానికి తాళం ఎస్కేయూ : వర్సిటీలో సహాయ కేంద్రంలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ అధికారి ప్రొఫెసర్ దశరథరామయ్యతో సమైక్యవాదులు వాగ్వాదానికి దిగారు. అప్పటికే దూరప్రాం తాల నుంచి అనేక మంది విద్యార్థులు,వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన కౌన్సెలింగ్‌ను సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు అడ్డుకొని అడ్మిషన్ల డెరైక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని అడ్మిషన్ల కార్యాలయానికి తాళం వేసి గంటకుపైగా బైఠాయించారు. వారు మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సెలింగ్ ఖచ్చితంగా నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర నరసింహ ఆదేశాలు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. ‘ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమాలు చేస్తున్నప్పుడు అనేక కోర్సుల కౌన్సెలింగ్‌లు నిలిపివేసిన విషయం గుర్తుకు రాలేదా’ అని డెప్యూటీ సీఎంను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటించే వరకు ఎలాం టి కౌన్సెలింగ్‌లు, తరగతులు జరగనివ్వబోమని సమైక్యవాదులు తెలిపారు. కౌన్సెలింగ్ అధికారి మాట్లాడుతూ బోధన, బోధనేతర సిబ్బంది కౌన్సెలింగ్ విధులకు హాజరుకాలేమని లేఖ ఇచ్చారని తెలిపారు. కౌన్సెలింగ్ చేపట్టే పరిస్థితి లేదని, అనంతరం ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యమనేత డాక్టర్ సదాశివరెడ్డి, విద్యార్థుల జేఏసీ నాయకులు, బోధనేతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు.