నినాదాలతో హోరెత్తిన పోలీస్‌స్టేషన్‌

Police Arrested Employees Demanding CPS Cancellation At Pamidi - Sakshi

సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ నినదించిన ఉద్యోగులు

సాక్షి, విజయవాడ: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఛలో అసెంబ్లీకి వెళ్లేందుకు బయటకు వస్తే అరెస్ట్‌ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు  ఛలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ... విజయవాడ రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లలో పలువురిని అరెస్ట్‌ చేశారు. అలాగే ఉద్యోగుల ‘ఛలో అసెంబ్లీ’  పిలుపు నేపథ్యంలో గుంటూరు, విజయవాడ, మంగళగిరి నుంచి అసెంబ్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అసెంబ్లీ, సచివాలయం వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఐడీ కార్డు ఉంటేనే వాహనాలను అటువైపు అనుమతిస్తున్నారు.

అలాగే ప్యాఫ్టో యూనియన్‌ నాయకులను, ఉపాధ్యాయులను అనంతపురం జిల్లా పామిడి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 25 మందిని ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్యాఫ్టో నేతల నినాదాలతో పోలీస్‌స్టేషన్‌ హోరెత్తింది. (సీపీఎస్‌ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు) సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని మూకుమ్మడిగా నినదించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇదిలాఉండగా..  ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌ రద్దు తీర్మానం చేయాలని, ఎన్‌ఎస్‌డీఎల్‌ రికవరీలను ఆపాలని, 653, 654, 655 జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top