గిరిజనులను ముంచిన కాఫర్‌ డ్యామ్‌

Polavaram Cofferdam effects the Tribals - Sakshi

గోదావరి వరద ముంపులో ఐదు వేల కుటుంబాలు

ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరికకే నిండా మునక

కనీస అంచనాల్లేకుండా టీడీపీ సర్కార్‌ చేసిన తప్పిదాలే ఉపద్రవానికి కారణం

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల మాటలను పెడచెవిన పెట్టి చంద్రబాబు సర్కార్‌ నిర్మించిన కాఫర్‌ డ్యామ్‌ గిరిజనుల ‘కొంప’ ముంచింది. అదే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో మన్యం వాసులు నిద్రలేని రాత్రులు గడిపే స్థితికి కారణమైంది. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో సమీప గ్రామాల్లో ప్రజలు వరద ముంపులో చిక్కుకుంటారని తెలిసినా నాటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం డ్యామ్‌కు సమీపాన ఉన్న దేవీపట్నం నుంచి కూనవరం మండలం వరకూ ఉన్న సుమారు ఐదు వేల కుటుంబాలు గోదావరి వరద ముంపునకు గురయ్యాయి. కాఫర్‌ డ్యామ్‌ను ఒక క్రమ పద్ధతిలో నిర్మించి ఉంటే ఇంతటి వరదను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడేదే కాదు. అటు పశ్చిమ గోదావరి జిల్లా పైడిపాక నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా పోసమ్మగండి వరకూ 1800 మీటర్ల పొడవు, 2400 మీటర్ల వెడల్పుతో కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించారు.

ఈ డ్యామ్‌కు రెండు వైపులా 300 మీటర్లు వంతున ఖాళీగా వదిలేశారు. ఏటా గోదావరికి ఆగస్టు వచ్చేసరికి వరదలు వస్తాయని తెలిసి కూడా ముందస్తు అంచనాలు లేకుండా చంద్రబాబు సర్కార్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టింది. కాఫర్‌ డ్యామ్‌ నిర్మించే ముందు కనీసం నిర్వాసితులకు రిహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ అందజేసి కాలనీలు నిర్మించి ఉంటే ఇప్పుడు ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాస్తవానికి భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులకు చేరుకుని మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు మాత్రమే ఈ గిరిజన గ్రామాలు వరద ముంపునకు గురవుతాయి.

కానీ ప్రస్తుతం భద్రాచలం వద్ద 46 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే జారీ చేశారు. అంటే.. వరద ముంపు ఈ గిరిజన గ్రామాలకు ఉండకూడదు. 48 అడుగులతో ఉన్నప్పుడు రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే 30 గ్రామాలు, 53 అడుగులతో ఉన్నప్పుడు మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే గిరిజన గ్రామాలన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. గోదావరికి భారీగా వరదలు వచ్చి భద్రాచలం వద్ద మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 1953, 1986, 2006, 2013లలో మాత్రమే ఈ గిరిజన గ్రామాలు నీట మునిగాయి. కానీ ఇప్పుడు ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసే సరికే గిరిజన గ్రామాలన్నీ జలదిగ్బంధానికి గురయ్యాయి. ఇదంతా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో ఎదురైన వరద ఉధృతేనని అధికారులే చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top