తొలిసారిగా ఆన్‌లైన్‌లో పీజీ మెట్ | PG medical entrance exam online | Sakshi
Sakshi News home page

తొలిసారిగా ఆన్‌లైన్‌లో పీజీ మెట్

Feb 27 2015 1:54 AM | Updated on Sep 5 2018 8:36 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా పేపర్‌పైన పెన్ను పెట్టాల్సిన అవసరంలేని ప్రవేశ పరీక్ష జరుగుతోంది.

సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా పేపర్‌పైన పెన్ను పెట్టాల్సిన అవసరంలేని ప్రవేశ పరీక్ష జరుగుతోంది. మార్చి 1న జరగనున్న పీజీ మెట్-2015 (పీజీ వైద్య ప్రవేశ పరీక్ష) తొలిసారిగా ఆన్‌లైన్‌లో జరుగుతోంది. పరీక్ష కేంద్రానికి పెన్నూ, పెన్సిలూ, పేపర్లు, నోట్‌బుక్కులు, సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కాలిక్యులేటర్లు అనుమతించరు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరీక్ష 2రాష్ట్రాల్లోని 12 కేంద్రాల్లో జరుగుతుంది.


 ఆన్‌లైన్ పరీక్ష సర్వీస్ ప్రొవైడర్లకు ఈ నెల 28న మాక్‌టెక్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ అధికారవర్గాలు పేర్కొన్నాయి. పరీక్ష నిర్వహణకు ఇద్దరు చీఫ్ కో ఆర్డినేటర్లు, ఆరుగురు పరిశీలకులు ఉంటారు. మార్చి 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష ఉంటుం ది. వైద్య పీజీతో పాటు పీజీ డిప్లొమా కోర్సులకూ ఈ టెస్ట్‌లో వచ్చిన ర్యాంకులే వర్తిస్తాయి. గత ఏడాది పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో అవినీతి అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఈ సారి ప్రవేశ పరీక్షకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
 
 అభ్యర్థులకు మార్గదర్శకాలు
 మార్చి 1 ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
 అభ్యర్థులు ఉదయం 8.15 గంటల నుంచి 9.15 గంటల మధ్య పరీక్ష కేంద్రానికి రావాలి
 9.15 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు
 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తేవాలి
 పరీక్ష సమయం పూర్తయే వరకూ అభ్యర్థులు బయటకు వెళ్లకూడదు
 
 పరీక్షా కేంద్రాలు ఇవే..
 ఏపీలో.. కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం కేంద్రాల్లో పీజీ మెట్ జరగనుంది. ఈ ఏడాది సుమారు 15 వేల మంది ఈ ప్రవేశ పరీక్ష రాస్తున్నట్టు అంచనా కాగా, రెండు రాష్ట్రాల్లో సుమారు 2 వేల వరకూ పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
 నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల అనర్హత
 నిబంధనలు అతిక్రమించిన అభ్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. అలాంటి వారు మూడేళ్ల పాటు ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయకుండా అనర్హత వేటు వేస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులు తెస్తే ఇన్విజిలేటర్లు స్వాధీనం చేసుకుని ఇక వెనక్కి ఇవ్వరని హెల్త్ వర్సిటీ అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement