షేమ్.. షేమ్... | Sakshi
Sakshi News home page

షేమ్.. షేమ్...

Published Tue, Jan 21 2014 4:27 AM

personal toilet shortage in villages

అనంతపురం టౌన్/ సిటీ, న్యూస్‌లైన్ :  ‘మడకశిర నియోజకవర్గంలోని పాపసానిపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని మంజూరు చేస్తాం.’- సాక్షాత్తు మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత అంగ్‌సాన్ సూచీ ఎదుట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కూడా వకాల్తా పుచ్చుకొని పాపసానిపల్లిని దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తామంటూ గొప్పలు చెప్పారు.

ఆ గ్రామానికి అంగ్‌సాన్ సూచీ వచ్చి వెళ్లి రెండేళ్లు కావస్తోంది. అయితే.. ఇప్పటికీ మన పాలకులు ఒరగబెట్టిందేమీ లేదు. ఒక్క పాపసానిపల్లిలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లోనూ ఇదే దుస్థితి. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల సొంత గ్రామాల్లో ‘న్యూస్‌లైన్’ బృందాలు పర్యటించాయి. వాటి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది.

 సాయంత్రం ఆరు దాటితే తప్ప.. మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లలేని దయనీయ పరిస్థితి ఉందంటే అందరూ సిగ్గుతో తలదించుకోవాలి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ సామూహిక మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీపజాప్రతినిధులు సొంత గ్రామాల్లో సైతం మరుగుదొడ్లను నిర్మింపజేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. దివంగత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శత జయంతి ఉత్సవాలను ఇటీవల రూ.కోట్లు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించారు. అయితే ఆయన సొంతూరైన ఇల్లూరులో ఇప్పటికీ మహిళలు సామూహిక మరుగుదొడ్డినే ఉపయోగిస్తున్నారు.

  జాడలేని నిర్మల్ భారత్ అభియాన్
 ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలు బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్), జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లకు అప్పగించింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.4500,  ఉపాధి హామీ పథకం కింద రూ.4500 మంజూరవుతోంది. లబ్ధిదారుని వాటాగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ. 9900తో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలి.

 అయితే.. ఈ పథకం కింద మండలానికి ఐదు పంచాయతీల చొప్పున మాత్రమే ఎంపిక చేస్తున్నారు. వాటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని డీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. మొదటి విడత కింద 54,494 మరుగుదొడ్లను మంజూరు చేశారు. వీటిలో 2,119 మాత్రమే పూర్తయ్యాయి. 7,592 నిర్మాణంలో ఉన్నాయి. మిగిలినవి ఎప్పటికి పూర్తి చేస్తారో అధికారులే చెప్పలేకపోతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు నిత్యం ఆదేశాలు జారీ చేస్తున్నా జిల్లాలో పురోగతి మాత్రం కనిపించడం లేదు.

 దీనికితోడు ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెరిగిన నిర్మాణ సామగ్రి (సిమెంటు, ఇసుక) ధరల కారణంగా ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చే మొత్తం ఏమాత్ర ం సరిపోవడం లేదని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు జాబ్ కార్డు ఉన్న వారికే బిల్లులు చెల్లిస్తామని మెలిక పెట్టారు. ఈ నిబంధన కారణంగా అప్పోసప్పో చేసి మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టిన వారు ఇబ్బంది పడుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement