రుణమాఫీ జాప్యాన్ని సహించం | peoples are have concern on debt waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీ జాప్యాన్ని సహించం

Aug 20 2014 2:09 AM | Updated on Oct 1 2018 2:03 PM

రైతులు, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని సహించబోమని, సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.

కడప సెవెన్‌రోడ్స్:  రైతులు, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని సహించబోమని, సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రుణ మాఫీ చేస్తామని ప్రజల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణమాఫీకి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రైతులకు రూ. 1.50 లక్షలు, డ్వాక్రాసంఘాలకు రూ. లక్ష మాఫీ చేసి మళ్లీ కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే, జీఓ నెం. 174 ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఒక్క బ్యాంకులో కూడా ఇంతవరకు రుణాలు మాఫీ కాలేదన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసి రుణాలు ఇప్పించాలని కోరారు. మాఫీ వర్తించని కౌలు రైతులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలన్నారు. డ్వాక్రాసంఘాలపై ఒత్తిడి చేస్తే బ్యాంకుల వద్ద ఆందోళనలు చేపడతామన్నారు. డ్వాక్రా సంఘాలు కోరకుండానే మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఒక్కో గ్రూపునకు రూ. లక్ష రివాల్వింగ్ ఫండ్‌గా ఇస్తామనడం సమంజసం కాదన్నారు.

ఎన్నికల హామీ మేరకు మాఫీ చేయాలన్నారు. ప్రతి జిల్లా అభివృద్ధికి ఎన్నో వరాలు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కడప పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రుణ మాఫీ చేస్తామంటేనే రైతులు నమ్మి టీడీపీకి ఓట్లు వేశారన్నారు. ఇప్పుడు రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగా లేదని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
 
ఓవైపు రుణాలు చెల్లించాలంటూ రైతులపై బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన రుణ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 884 అడుగులకు నీటిమట్టం చేరినప్పటికీ జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. కేంద్రం రాష్ట్రానికి 11 జాతీయ సంస్థలను మంజూరుచేసినా జిల్లాకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జి.చంద్ర, నాయకులు కేసీ బాదుల్లా, టి.రామసుబ్బారెడ్డి, కృష్ణమూర్తి, జి.వేణుగోపాల్, నాగసుబ్బారెడ్డి, డబ్ల్యు రాము, బోగాది శెట్టి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement