
రూ.47.91 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం
రాష్ట్రంలో 79,860 మంది విద్యార్థులు అర్హులుగా గుర్తింపు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం ప్రకారం ఇంటినుంచి దూరంగా ఉన్న బడులకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపినట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ తెలిపారు. పాఠశాలలు లేని ఆవాసాలు, కొండ ప్రాంతాలు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి ప్రాథమిక, ఉన్నత, మాధ్యమిక స్థాయి పిల్లలకు రవాణా భత్యం చెల్లింపునకు మార్గదర్శకాలను సర్వశిక్ష రాష్ట్ర విభాగం విడుదల చేసింది.
ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి ఒక కి.మీ. పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, 5 కి.మీ. పరిధిలో ఉన్నత పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ పరిధి దాటి విద్యార్థులు బడికి వెళ్లాల్సి వస్తే రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోడల్ విద్యావిధానం పేరుతో పలు ప్రభుత్వ స్కూళ్లను, తరగతులను మరో పాఠశాలలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 79,860 మంది విద్యార్థులు ఆ పరిధి దాటి బడులకు వెళుతున్నట్టు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు. ఇందులో 41,697 మంది ఎలిమెంటరీ, 38,163 సెకండరీ స్కూళ్ల విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యారి్థకి నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రూ.6 వేలు చెల్లించనున్నారు. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ రూ.47.91 కోట్ల బడ్జెట్ ఆమోదించింది. ఈ మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే వర్తిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ స్పష్టం చేశారు. క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ సంబంధిత విద్యార్థుల వివరాలను లీప్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.