అన్నొస్తున్నాడు.. పదండి చూద్దాం.. | People supporting with ys jagan praja sankalpa yatra | Sakshi
Sakshi News home page

అన్నొస్తున్నాడు.. పదండి చూద్దాం..

Nov 30 2017 6:46 AM | Updated on Jul 25 2018 4:07 PM

People supporting with ys jagan praja sankalpa yatra - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పట్ల పల్లెల్లో ఆత్మీయత ఉట్టిపడుతోంది. అడుగడుగునా అభిమానం అడ్డుపడుతుండటంతో ఊరు దాటాలంటే ఆలస్యమైపోతోంది. జననేతను చూసేందుకు ఊరంతా పోటీపడుతోంది. అడుగు పెట్టడమే ఆలస్యం.. అలసిపోయిన పాదాలకు ముద్ద బంతులు పాన్పులవుతున్నాయి. మహిళల మంచి మనసులే మంగళహారతులవుతున్నాయి. ‘అన్నొస్తున్నాడు’ అంటూ జనం రోడ్డుపైకి పరుగెత్తుకొస్తున్నారు. మిద్దెలు, మేడలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఆమడ దూరం నుంచే అభివాదం చేసేవాళ్లు.. ముకుళిత హస్తాలతో నమస్కరించే వాళ్లు.. యువత కేరింతలు.. అమ్మల ఆత్మీయ పలకరింపులు. ‘అదిగో అన్న’ అంటూ చిన్నారులను భుజాలకెత్తుకుని చూపించే తల్లిదండ్రులు.. అక్కా చెల్లెమ్మలు.. చేతికర్ర ఊతంతో జననేతను సమీపించేందుకు పోటీపడే వృద్ధులు.. ఈ దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి. ఆ పూట తిండీతిప్పలు పట్టించుకోకుండా వేలాది జనం జగన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దగ్గరకు రాగానే.. జగన్‌తో మాట కలపడానికి, కరచాలనం చేయడానికి పోటీ పడుతున్నారు. 

అందరిలోనూ అదే ఉత్సాహం
జగన్‌ను చూసేందుకు, పలకరించేందుకు, కరచాలనం చేసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. మొన్న వెల్దుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులంతా జగన్‌ను చూసి కేరింతలు కొట్టారు. కిటికీల్లోంచి చేతులు, తలలూ బయటపెట్టి ‘అన్నా...’ అంటూ కేకలేశారు. ఆ సన్నివేశాన్ని గమనించిన జగన్‌ వారితో కరచాలనం చేశారు. ఆ అభిమానంతో వాళ్లు పులకరించిపోయారు. ఇదే సన్నివేశం కోడుమూరులోని కోట్ల సర్కిల్‌ వద్ద కన్పించింది. బస్సు కిటికీల్లోంచే జనం బయటకొచ్చే ప్రయత్నం చేశారు. ఓ బస్సు డ్రైవర్‌ ఏకంగా తన కిటికీ తలుపును పట్టుకుని సర్కస్‌ ఫీట్లు చేసినట్టు జగన్‌తో కరచాలనం చేసి మురిసిపోయాడు. కైరవాడి వద్ద కూడా ఇలాంటి సన్నివేశం చోటుచేసుకుంది. లారీ ఎక్కిన యువత కేరింతలు కొడుతూ జననేతతో కరచాలనం కోసం అమాంతం వంగిపోయారు. కోడుమూరులో బండెనక బండికట్టి పెద్ద సంఖ్యలో రైతులు అభిమానం మూటగట్టుకుని తరలి రావడం మరో అరుదైన సన్నివేశం. వెంకటగిరి నుంచి గోరంట్ల వరకూ ట్రాక్టర్‌లో మహిళలు కిక్కిరిసి కూర్చొని మరీ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు.

‘అన్నొస్తున్నాడే...’ అంటూ యువతులు బైక్‌ను నడపడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. ఎమ్మిగనూను మండలం పొర్లపల్లి నుంచి గోనెగండ్ల మండలం కైరవాడికి కేవలం జగన్‌ పాదయాత్ర చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకే వచ్చినట్టు వాళ్లు చెప్పారు. రామళ్లకోట దగ్గర రాళ్లగుట్టలెక్కి కేరింతలు కొట్టిన యువత.. జన నేత ప్రసంగంతో ఊగిపోయి ఈలలేసిన గోరంట్ల జనం.. ‘మీ పిల్లలను నేను చదివిస్తా’ నంటూ భరోసా ఇచ్చినప్పుడు మిద్దెలు, మేడలపై ఉన్న మహిళలు చేసిన కరతాళధ్వనులు.. జనం తమను తాము మరచిపోయారా.. అన్పించేలా ఉంటున్నాయి. జనం చూపిస్తున్న కొండంత అభిమానాన్ని జగన్‌ తన గుండెల్లో నింపుకుంటూ.. ఆత్మీయంగా వారి గుండె తడుతున్నారు. పలకరింపుతోనో.. కరచాలనంతోనో.. కనుసైగతోనో.. ప్రతిస్పందిస్తూ ముందుకు సాగుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement