ఎమ్మెల్యే వర్మను సస్పెండ్‌ చేయాలి

People Demand To Suspend MLA Varma From TDP Party - Sakshi

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప్రజాసంఘాల డిమాండ్‌

తూర్పుగోదావరి, పిఠాపురం: గొల్లప్రోలు నగరపంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శివలక్ష్మిను అవమానించిన ఎమ్మెల్యే వర్మను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. స్థానిక విష్ణాలయంలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కులవివక్ష పోరాట సమితి మండల కేఎస్‌ నాయకులు ఏలేటి నానిబాబు మాట్లాడుతూ మహిళ అని చూడకుండా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శివలక్ష్మి చేతులతో మురుగును తీయించిన వర్మపై తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో నియంత పాలన చేస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మహిళా అధికారి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడం తగదన్నారు. జిల్లా నాయకులు శ్రీనివాస్‌ మాట్లాడుతూ సిబ్బందిని నియమించడం చేతగాని వ్యక్తి మహిళా అధికారిపై అనుచితంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో అధికారులకు, సిబ్బందికి  రక్షణ లేకుండా పోయిందన్నారు.

తక్షణం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఎమ్మెల్యే క్షమాపణ చేప్పాలన్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళా అధికారిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎమ్మెల్యే వైఖరిని ఖండించాల్సింది పోయి సస్పెన్షన్‌ ఆర్డర్స్‌ జారీ చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి కూరాకుల సింహాచలం, రజకవృత్తి దారులు సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు, డీహెచ్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి అంజిబాబు, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పప్పు దుర్గారమేష్, ఐఏన్‌టీయూసీ నాయకులు కేశవరపు అప్పలరాజు, లాయర్‌ అసోసియేషన్‌ నాయకులు జీఎస్‌ భాస్కర్, ప్రజా సంఘాలు నాయకులు నాగేశ్వరరావు, కొజ్జారపు త్రిమూర్తులు, సురేష్, అశోక్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top