తిరుగుతున్నా కనికరం లేదా!

People Applications To SP Grievance in PSR Nellore - Sakshi

గ్రీవెన్స్‌డేలో అర్జీదారుల ఆవేదన  

నెల్లూరు(పొగతోట): సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు పట్టుకుని తిరుగుతున్నా కనికరం లేదా అని పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రావడం పోవడమే కానీ మాగోడు వినేనాథుడే కరువయ్యాడని వాపోయారు. పేదల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, జేసీ–2 కమలకుమారి, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి వినతిపత్రాలు స్వీకరించారు.

ఉద్యోగం నుంచి తొలగించారు
ఎస్టీ కులానికి చెందిన నేను చిన్నతనం నుంచి కష్టపడి చదివాను. కొడవలూరు మండలం, సీఎస్‌పురంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో టీజీటీ (హిందీ, పార్ట్‌టైం)గా 2015లో చేరాను. 2017లో నేను పనిచేస్తున్న పోస్ట్‌ను గిరిజనేతర మహిళకు కేటాయించారు. వేరే మరో పోస్ట్‌లో పనిచేయమని అధికారులు చెప్పారు. ఈ విషయం రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సీఎస్‌పురంలో కొనసాగించమని ఆదేశాలిచ్చారు. ఎలాంటి పొరపాటు చేయకపోయినా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. న్యాయం చేయాలి.– నాగమణి, వెంకటేశ్వరపురం

గ్రామాన్ని తరలించండి
అన్నవరం, గట్టుపల్లి పంచాయతీల్లో సుమారు 600 దళిత, గిరిజన కుటుంబాల వారం జీనవం సాగిస్తున్నాం. గ్రామాల సమీపంలో క్వారీ ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. దీంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇళ్లు పగుళ్లిచ్చి పెచ్చులూడుతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. జిల్లా అధికారులు స్పందించి క్వారీని నిలుపుదల చేయండి లేదా గ్రామాన్ని తరలించండి.– అన్నవరం, గట్టుపల్లి గ్రామస్తులు, జలదంకి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top