ఆరని ఎన్నికల చిచ్చు! | Panchayat elections completed ladders fight | Sakshi
Sakshi News home page

ఆరని ఎన్నికల చిచ్చు!

Aug 6 2013 3:23 AM | Updated on Mar 19 2019 7:01 PM

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినా వాటి కారణంగా పల్లెసీమల్లో ఎర్పడిన వివాదాలు మాత్రం సమసిపోలేదు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినా వాటి కారణంగా పల్లెసీమల్లో ఎర్పడిన వివాదాలు మాత్రం సమసిపోలేదు. ఓట్ల కోసం వర్గాలుగా ఏర్పడిన ప్రజలు చిన్నచిన్న కారణాలకే వాగ్వాదం, ఘర్షణకు దిగుతుండడంతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోంది.  గోనెగండ్ల మండలం హెచ్. కైరవాడి గ్రామంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఎస్సీలు కులవృత్తిని మానుకునే వరకు వచ్చింది. వివరాలు.. గ్రామంలో ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి(ఎస్సీ) ఓడిపోగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అభ్యర్థి(మాల) గెలిచారు. ఈ ఫలితాలతో ఇరువర్గాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. 
 
 దీంతో గ్రామంలోని ఓ వర్గానికి చెందిన రైతులు పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను లోడింగ్ చేయడంపై ఎస్సీ హమాలీల్లో విభేదాలొచ్చాయి. ఇదే క్రమంలో ఆదివారం ఒక వర్గానికి చెందిన చిన్నారి మరణించడంతో ఖననం చేసే నిమిత్తం గోతి తవ్వేందుకు పిలవగా మరో వర్గం ఎస్సీలు నిరాకరించారు. ఇందుకు ప్రతిగా ఆ వర్గం వారు తాము కూడా ఎస్సీలను ఏ పనులకు పిలిచేది లేదని ప్రకటించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్‌ఐ వెంకట్రామిరెడ్డి సోమవారం గ్రామానికి వచ్చి ఇరువర్గాలవారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. 
 
 కొందరు ఆయన అభిప్రాయంతో ఏకీభవించగా మరికొందరు ఒప్పుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన చాకలి కులస్తులే శ్మశానంలో గోతి తవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ మాట్లాడుతూ ఇది సున్నితమైన సమస్య అని, ఇరువర్గాలవారు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చర్యలు తప్పవని ఇరువర్గాల వారిని హెచ్చరించారు. మరోమారు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్‌ఐ విలేకరులతో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement