ఆస్పత్రులకు అందని ఆక్సిజన్‌

Oxygen shortage in Ap Medical colleges and Hospitals - Sakshi

రాష్ట్రంలో మొత్తం బోధనాస్పత్రులు 11

ఆక్సిజన్‌ సిలిండర్లకు ఏటా అయ్యే వ్యయం రూ.15 కోట్లు

ప్రభుత్వం ఇస్తోంది కేవలం రూ.8 కోట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బోధనాస్పత్రులను ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే ఆక్సిజన్‌ సరఫరాలో ప్రభుత్వ అలక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. పెద్దాస్పత్రుల్లో ఆక్సిజన్‌ లేనిదే ఒక్క గంట కూడా గడవదు. పైగా దేశంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతోంది రాష్ట్రంలోనే. ప్రమాద బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వస్తుంటారు. ఒక్కో ఆస్పత్రికి మూడు నెలలకుగాను రూ.30 లక్షలు అవసరమవుతుండగా.. ప్రభుత్వం కనీసం రూ.20 లక్షలు కూడా ఇవ్వడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో బయటి నుంచి సిలిండర్లు తెప్పించుకుంటున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో 25 శాతం ఎక్కువ రేటుకు ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు.

రూ.15 కోట్లకు.. ఇస్తోంది రూ.8 కోట్లే
రాష్ట్రంలో మొత్తం 11 బోధనాస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లకు ఏటా రూ.15 కోట్లు పైనే వ్యయం అవుతుంది. కానీ ప్రభుత్వం ఇస్తోంది.. కేవలం రూ.8 కోట్లు మాత్రమే. దీంతో కొన్ని ఆస్పత్రుల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జనరల్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆస్పత్రులకే ఆక్సిజన్‌ సరఫరాకు సరిపడా నిధులు విడుదల కావడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top