ఎట్టకేలకు చేరింది

ONGC Base Complex Radiation Element Reached  - Sakshi

ఓఎన్‌జీసీ బేస్‌ కాంప్లెక్స్‌కు చేరిన రేడియోధార్మికమూలకం సీఎస్‌–137 కంటైనర్‌

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్‌: ఓఎన్‌జీసీలో చమురు, గ్యాస్‌ తవ్వకాలకు వినియోగించే శక్తిమంతమైన రేడియోధార్మిక మూలకం సీఎస్‌–137 కంటైనర్‌ సురక్షితంగా గురువారం తెల్లవారుజామున ఓఎన్‌జీసీ బేస్‌కాంప్లెక్స్‌కు చేర్చారు. మాయమైన మూలకం కంటైనర్‌ను కృష్ణాజిల్లా కలిదిండిలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈనెల 12న కృష్ణాజిల్లా మల్లేశ్వరానికి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి, తిరిగి ఈనెల 14న బేస్‌కాంప్లెక్స్‌కు తీసుకువచ్చారు. ఈనెల 16న పరిశీలించగా లాగింగ్‌ యూనిట్‌కు ఉండాల్సిన రేడియోధార్మిక మూలకం సీఎస్‌–137 కంటైనర్‌ కనిపించలేదు. దీంతో ఈనెల 17వతేదీన ఓఎన్‌జీసీ అధికారులు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమూషీబాజ్‌పాయ్‌ ఆదేశాల మేరకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి కృష్ణాజిల్లా కలిదిండి పాత ఇనుపదుకాణంలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్, ఓఎన్‌జీసీ అధికారులు సంయుక్తంగా రేడియో ధార్మికమూలకం సీఎస్‌–137 కంటైనర్‌ను సురక్షితంగా ఓఎన్‌జీసీ బేస్‌కాంప్లెక్స్‌కు చేర్చారు.

జాకీగా భావించి రూ.540కు విక్రయం
రేడియోధార్మిక మూలకం సీఎస్‌–137 ఓఎన్‌జీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై జారిపడిపోయినట్టు భావిస్తున్నారు. అది వ్యక్తికి దొరకగా దానిని లారీటైర్లు విప్పే జాకీగా భావించి కలిదిండి గ్రామంలోని పాత ఇనుపసామాన్ల దుకాణంలో 27కిలోల కంటైనర్‌ను కిలో రూ.20 చొప్పున రూ.540కు విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అధికారుల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా రూ.35లక్షలు దానిని రూ.540కు విక్రయించడం గమనార్హం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top