
మృతుడు సూర్యనారాయణ (ఫైల్)
బతికుండగానే ఆ వృద్ధుడిని అధికారులు కాగితాలపై చంపేశారు. ఫలితంగా అప్పటివరకూ ప్రతి నెలా అందుతున్న రూ.200 వృద్ధాప్య పింఛను నిలిచిపోయింది.
తుని: బతికుండగానే ఆ వృద్ధుడిని అధికారులు కాగితాలపై చంపేశారు. ఫలితంగా అప్పటివరకూ ప్రతి నెలా అందుతున్న రూ.200 వృద్ధాప్య పింఛను నిలిచిపోయింది. దీనిపై బెంగటిల్లిన ఆ వృద్ధుడు.. తాను బతికే ఉన్నానంటూ పింఛను కోసం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ మూడు నెలలుగా కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు పెంచిన పింఛను అందకుండానే అతడి గుండె ఆగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరానికి చెందిన తోట సూర్యనారాయణ(69) అనే వృద్ధుడి విషాదాంతమిది.
ఆయనకు చాలాకాలంగా రూ.200 వృద్ధాప్య పింఛను వస్తోంది. బాబు సీఎం అయ్యాక, వృద్ధాప్య పింఛనును రూ.1000 చేస్తామని ప్రకటించడం తెలిసిందే. పింఛను అర్హతలను నిర్ణయించేందుకు వేసిన కమిటీ, సూర్యనారాయణ చనిపోయినట్టు నివేదిక ఇచ్చింది. దాంతో అప్పటిదాకా వస్తున్న రూ.200 పింఛను కూడా ఆగింది. తాను బతికే ఉన్నానని ఆయన అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆ బెంగతోనే ఆయన మంగళవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.