వైవీయూ నిర్లక్ష్యం..! 

Officials Who Have Not Updated The Website Of Yogivemana University - Sakshi

అప్‌డేట్‌ కాని వైవీయూ వెబ్‌సైట్‌

చాన్స్‌లర్‌ మారినా ఫొటో మార్చని వైనం

పాలకమండలి రద్దుఅయినా ఇంకా వారిపేర్లే దర్శనం

ఆధునిక సాంకేతికత కొంత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో.. అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన విశ్వవిద్యాలయం పాత చింతకాయపచ్చడిలా..పాత సమాచారాన్నే కొనసాగిస్తూ.. నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తోంది.  సాక్షాత్తు విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్‌ మారినా ఇంకా అధికారులకు మాత్రం తెలియనట్లుంది.  వైవీయూ పాలకమండలిని రద్దు చేసి 
నెలరోజులవుతున్నా ఇంకా వారిపే ర్లనే కొనసాగిస్తూ తరిస్తున్నారు. ఇటువంటి చిత్ర విచిత్రాల సమాచారం కనిపించే వైవీయూ వెబ్‌సైట్‌ నిర్వహణపై ప్రత్యేక కథనం..

సాక్షి, వైవీయూ: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఏదైనా సమాచారం అవసరమైతే ఎక్కువగా ఇంటర్నెట్‌ మీద ఆధారపడుతున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల విద్యార్థులు ఏదైనా సమాచారం కోసం వైవీయూ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే కొన్ని అంశాలు మినహా మిగతా సమాచారం అంతా పాతదే కనిపిస్తోంది. దీనికి తోడు జూలై 17న విశ్వవిద్యాలయాలు తప్పని సరిగా వెబ్‌సైట్‌లో సమాచారాన్ని వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని యూజీసీ సూచిస్తూ రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. వెబ్‌సైట్‌లో నమోదు చేసే అంశాలకు సంబంధించి డాక్యుమెంట్స్,  ఫొటోగ్రాఫ్స్, వీడియో తదితర అంశాలను తాజా సమాచారంతో పొందుపరచాలని  సర్కులర్‌ సైతం జారీ అయింది.

అప్‌డేట్‌ కాని సమాచారం..
ఈనెల 24వ తేదీన రాష్ట్ర గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌ ఎవరైతే ఉంటారో వారే విశ్వవిద్యాలయాలకు చాన్సలర్‌గా ఉంటారు. అయితే వైవీయూ వెబ్‌సైట్‌లో మాత్రం ఇప్పటికీ చాన్సలర్‌గా పూర్వపు గవర్నర్‌ నరసింహన్‌ చిత్రమే కనిపించడంతో పాటు పేరు కూడా మార్చలేదు.
జూన్‌ 28వ తేదీన వైవీయూ పాలకమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికీ పాలకమండలి సభ్యులుగా టీడీపీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, విజయజ్యోతి, సానుభూతి పరులు పెంచలయ్య, రామచంద్రయ్య పేర్లను వెబ్‌సైట్‌లో కొనసాగిస్తున్నారు. ఇదే వరుసలో ఉన్న ప్రిన్సిపల్, రిజిస్ట్రార్, రెక్టార్ల పేర్లను, సమాచారం మాత్రం అప్‌డేట్‌ చేసిన వీరికి పైనే మారిన పాలకమండలి సభ్యుల పేర్లు కనిపించకపోవడం గమనార్హం.
వెబ్‌సైట్‌లో ప్రిన్సిపల్‌గా ఆచార్య జి.సాంబశివారెడ్డి పేరు, ఫొటో కరెక్ట్‌గా చూపుతున్న వెబ్‌సైట్, వైస్‌ ప్రిన్సిపల్‌గా ఆచార్య కె. కృష్ణారెడ్డి నియమితులైనా ఆయన ఫొటో, పేరు లేకుండా మళ్లీ ఆచార్య జి.సాంబశివారెడ్డి చిత్రమే కనిపిస్తోంది.
పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా పనిచేసిన డా. వి. వెంకట్రామ్‌ రెండు నెలల క్రితమే మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీకి అనుబంధ నూజివీడు పీజీ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అయినప్పటికీ ఆయన చిత్రం, పేరు, సమాచారమే ఇప్పటికీ దర్శనమిస్తోంది. ఈయన వైవీయూ రిసెర్చ్‌ సెల్‌ కోఆర్డినేటర్‌గా కూడా కొనసాగుతున్నట్లు పాతసమాచారమే దర్శనమిస్తోంది.
వెబ్‌సైట్‌లో ప్రవేశాల గురించి తెలుసుకుందామని అడ్మిషన్స్‌పై క్లిక్‌ చేస్తే అండర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అని చూపుతోంది.
వీటితో పాటు వైవీయూలోని కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారం లేదు. గత రెండు సంవత్సరాలకు పైగా ఉర్దూ కోర్సు నడుస్తున్నప్పటికీ ఇది ఉన్నట్లు కూడా చూపడం లేదు. ఇటీవల ప్రవేశపెట్టిన ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఎంఎస్సీ ఫుడ్‌టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటేషనల్‌ డాటా సైన్స్‌ కోర్సుల ఊసు వెబ్‌సైట్‌లో లేదు.
వీటితో పాటు ఐక్యూఏసీ (ఇంటర్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌సెల్‌) విభాగం క్లిక్‌ చేస్తే చివరిసారిగా 2015 డిసెంబర్‌ 1లో అప్‌డేట్‌ చేసినట్లు చూపుతోంది.
ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయానికి పలు పురస్కారాలు వచ్చాయి. వీటికి సంబంధించిన సమాచారం కూడా నమోదు చేయలేదు. రూ.17 కోట్లు వెచ్చించి నిర్మించిన ఆర్ట్స్‌బ్లాక్‌కు సంబంధించిన చిత్రం ఒక్కటి కూడా వైవీయూ ఫొటోగ్యాలరీలో కనిపించకపోవడం గమనార్హం.
అబౌట్‌ వైవీయూలోకి వెళ్లి అడ్మినిష్ట్రేషన్‌ వింగ్‌ను క్లిక్‌ చేస్తే కేవలం చిత్రాలు ఉంటాయే తప్ప అక్కడ ఎవరి పేర్లు, సమాచారం కనిపించవు. వివరాలు లేకుండా ఫొటోలు ఎందుకు ఉంచారో ఎవరికీ తెలియదు.
వైవీయూ పీహెచ్‌డీ థీసిస్‌ అన్న అంశాన్ని ఓపెన్‌చేస్తే 2017 జూలై 21వ తేదీ వరకు వచ్చినవి మాత్రమే కనిపిస్తాయి. తర్వాత నుంచి సమర్పించిన పీహెచ్‌డీల సమాచారం లేదు.
2019 పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చినా ఇంకా 2018 ఇన్‌స్టంట్‌ పరీక్షలకు సంబంధించిన ఫలితాల సమాచారమే కనిపిస్తోంది.
సమాచారహక్కు చట్టంలో నేటికీ నాలుగు సంవత్సరాల క్రితం ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేసిన ఆచార్య జయపాల్‌గౌడ్‌ పేరే ఉండటం గమనార్హం.
పైన కనిపిస్తున్నవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అప్‌డేట్‌ సమాచారాన్ని అందించాల్సిన విశ్వవిద్యాలయ పాలకులు ఇంకా పాత సమాచారాన్నే కలిగి ఉండటం నెటిజన్లకు ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాజా సమాచారంతో పాటు విభాగాలకు సంబంధించిన పూర్తి సమాచారం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచాలని విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు.

వైవీయూ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్న పూర్వపు చాన్సలర్‌ చిత్రం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top