పేరుకే మెనూ పెట్టిందే తిను | Nutrition not giving in government hostels | Sakshi
Sakshi News home page

పేరుకే మెనూ పెట్టిందే తిను

Published Sat, Jan 25 2014 3:46 AM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

Nutrition not giving in government hostels

పెనుమూరు, న్యూస్‌లైన్:  హాస్టళ్లలోని విద్యార్థులకు రోజూ గుడ్డు, వారంలో ఓ రోజు మాంసం, ప్రతి రోజూ సాయంత్రం రాగి గంజి, అరటి పండు లాంటి పౌష్టికాహారం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. వెంగళరాజుకుప్పం బీసీ బాలుర హాస్టల్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.  ఈ హాస్టల్‌లో 110 మంది విద్యార్థులు చదువుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే 16 మంది మాత్రమే హాస్టల్‌కు రోజూ వస్తున్నారు.

అయితే 16 మంది మాత్రమే హాస్టల్‌కు రోజూ వస్తున్నారు. మిగిలిన వారు హాస్టల్‌లో సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్ల వద్దే ఉంటున్నారు. హాస్టల్ వార్డెన్ రాత్రి 8 గంటలకు వచ్చి తెల్లవారుజామున 5.30 గంటలకు వెళ్లిపోతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అసలు రారంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు భయంభయంగా ఉంటున్నారు.

 పెట్టింది తినాల్సిందే..
 హాస్టల్‌లో కుక్ పెట్టిన అన్నం తినాల్సిందే. మెనూ గురించి బోర్డులో చదవడం తప్ప ఎప్పుడూ తిని ఎరగమని విద్యార్థులు చెబుతున్నారు. అన్నంలో పురుగులు ఉంటున్నాయని, అదీ కడుపు నిండా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల సాంబారు, రసమే తమకు దిక్కని, ఈ విషయం అడిగితే  కుక్ సైతం కొడుతున్నారని విద్యార్థులు అంటున్నారు.

 భయపడుతూనే బతుకు..
 హాస్టల్ గ్రామానికి దూరంగా అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడకు వెళ్లాలంటే ముళ్లపొదల మధ్యలో పోవాల్సిందే. చుట్టూ చీకటి. దీనికితోడు హాస్టల్ గదులు శిథిలావస్థలో ఉన్నాయి. పై భాగంలో పెచ్చులు ఊడుతూ వర్షాలకు ఉరుస్తున్నాయి. విద్యార్థులపై పెళ్లలు విరిగిపడిన సందర్భాలూ ఉన్నాయి. కిటికీలు సరిగా లేకపోవడంతో చలికి విద్యార్థులు వణికి పోతున్నారు. రాత్రి పూట కిటికీల గుండా పాములు, అడవి పిల్లులు హాస్టల్ గదుల్లోకి వచ్చేస్తున్నాయి. అలాగే హాస్టల్‌కు గేటు లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు రాత్రి పూట సంచరిస్తున్నారు. మందుబాబులు మద్యం బాటిళ్లను హాస్టల్ ఆవరణలో పడేస్తున్నారు.

 ఎవరికి చెప్పుకోవాలి...
 సమస్యలు చెప్పుకుందామంటే అధికారులు సైతం హాస్టల్‌కు రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్‌కు తెలిసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. స్విచ్ బోర్డులను తాకితే షాక్ కొడుతున్నాయని అంటున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని మండల అధికారులకు పలుమార్లు చెప్పినా స్పందన కరువైందని చెబుతున్నారు.

 తాగునీటికి ఎన్ని కష్టాలే
 హాస్టల్‌లోని బోరు పాడైంది. దీంతో హాస్టల్‌కు దూరంగా ఉన్న చేతిబోరే విద్యార్థులకు దిక్కవుతోంది. నిత్యం అక్కడి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నీటిలోనూ కొంత కాలంగా సిలుం వస్తోంది. ఈ నీటిని ఉపయోగించిన కారణంగా అన్నం రంగు మారుతోంది. ఇలాంటి అన్నం తింటుంటే భయమేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 అధికారుల మాయాజాలం!
 హాస్టల్‌లో 110 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే 16 మంది మాత్రమే హాస్టల్‌లో ఉన్నారని, మిగిలిన వారు ఇళ్ల వద్దే ఉన్నారని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్‌కు రాని వారి సరుకులను అధికారులు అమ్మేసుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు సైతం సరైన భోజనం పెట్టకుండా సరుకులు అమ్ముతుంటే కడుపు కాలుతోందని చెబుతున్నారు.

 విద్యాహక్కు చట్టానికీ తూట్లు
 హాస్టళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం తప్పక కల్పించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. అయితే వెంగళరాజుకుప్పం బాలుర హాస్టల్‌లో మరుగుదొడ్లు అలంకారప్రాయంగా ఉన్నాయి. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. తలుపులు సరిగా లేవు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వెంగళరాజుకుప్పం వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులు సమస్యలు తెలియజేశారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
 24జీడీఎన్01: వెంగళరాజుకుప్పం హాస్టల్
 24జీడీఎన్02: శిథిలావస్థలో ఉన్న గదులు
 24జీడీఎన్03:మరమ్మతులకు నోచుకోని బోరు
 24జీడీఎన్04:నిరుపయోగంగా మరగుదొడ్లు
 24జీడీఎన్05:విరిగిన కిటికీలు
 24జీడీఎన్06:పిచ్చిమొక్కలతో హాస్టల్ పరిసరాలు
 24జీడీఎన్07: గేటు లేని హాస్టల్ ముఖద్వారం

Advertisement
Advertisement
Advertisement