చందుర్తి(వేములవాడ): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పాముకాటుతో మృత్యువాత పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చేకుట లత, రమేశ్ దంపతుల ఏడాదిన్నర వయసు ఉన్న కూతురు వేదాన్షి శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా హఠాత్తుగా ఇంట్లో వారికి ఏడుపు వినిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి పరిశీలించగా చిన్నారి కాళ్ల వేలి మధ్యలో నుంచి రక్తం కారుతుండటంతో వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించి, పాము కాటు తో పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పాప ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి తండ్రి రమేశ్ ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. పాముకాటుకు కూతురు మృతిచెంది న విషయం తెలుసుకున్న తండ్రి రమేశ్ స్వగ్రా మానికి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పాప మృతదేహాన్ని బాడీఫ్రీజర్‌లో భద్రపరిచారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.


