చూసుకో.. రాసుకో! | nursing students caught mass copying in kakinada | Sakshi
Sakshi News home page

చూసుకో.. రాసుకో!

Oct 6 2017 10:30 AM | Updated on Oct 6 2017 10:30 AM

nursing students caught mass copying in kakinada

‘‘నర్సింగ్‌ పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వస్తున్నాయి. మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాగైతే చెడ్డ పేరు వస్తుంది. పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్, స్లిప్పులు పెట్టడం వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి’’ ఇదీ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేసిన హెచ్చరిక. ‘‘ఆ సూపరింటెండెంట్‌ మాటను లెక్కచేయడమేంటిలే.. మన పని మనం చేసుకుందాం’’ అనుకున్నారో ఏమో యథేచ్ఛగా స్లిప్పులు తెచ్చేశారు. ఇష్టానుసారంగా మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. చివరకు సుమారు పది మంది వరకు విద్యార్థులు స్లిప్పులు చూసి రాస్తూ ఇన్విజిలేటర్లకు పట్టుబడ్డారు. మరోవైపు ఆర్‌ఎంసీ కళాశాల ఆవరణ బయట, డ్రైనేజీల్లో స్లిప్పులు దర్శనమివ్వడంతో పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌ ఏ విధంగా జరిగిందో
అర్థమవుతోంది.

కాకినాడ వైద్యం: కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో శుక్రవారం నుంచి ప్రారంభమైన నర్సింగ్‌ పరీక్షల్లో జోరుగా మాల్‌ ప్రాక్టీస్‌ జరుగుతోంది. జిల్లాలో ఉన్న సుమారు 37 ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. ఇందులో జీజీహెచ్‌కు చెందిన ప్రభుత్వ నర్సింగ్‌ స్కూల్‌ నుంచి కొంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జీఎన్‌ఎం నర్సింగ్‌ పరీక్షలో అధికంగా మార్కులు సాధిస్తే ప్రభుత్వం భర్తీ చేసే జీఎన్‌ఎం నర్సింగ్‌ పోస్టుల్లో కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ప్రైవేట్‌ స్కూళ్ల నిర్వాహకులు పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులకు అధికంగా మార్కులు వచ్చేలా ఈ స్లిప్పులు అందజేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా స్లిప్పులు రాసుకునేలా ఒక్కో ప్రైవేట్‌ కాలేజీ నుంచి రూ.50 వేలు  వంతున జీజీహెచ్‌లోని నర్సింగ్‌ పాఠశాలల బాధ్యతను చూసుకుంటున్న ఓ గుమస్తా వసూలు చేసినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడిన సదరు ఉద్యోగి పరీక్షా కేంద్రాల్లో నియమించిన ఇన్విజిలేటర్లకు తలో కొంత ఇచ్చి మేనేజ్‌ చేస్తానని నర్సింగ్‌ స్కూళ్ల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

1,272 మంది హాజరు
శుక్రవారం జరిగిన తొలిసంవత్సర పరీక్షకు జిల్లాలోని 37 నర్సింగ్‌ కాలేజీల నుంచి 1,433 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,272 హాజరయ్యారు. 161 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని కాకినాడ ఆర్డీవో ఎల్‌ రఘబాబు పర్యవేక్షించారు. ఇద్దరు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాల్‌ టికెట్లు లేకుండా రావడంతో పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు నిరాకరించడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆలస్యంగా ప్రారంభమైన నర్సింగ్‌ పరీక్షలు
కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో శుక్రవారం నుంచి నర్సింగ్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) నర్సింగ్‌ మొదటి సంవత్సరం పరీక్షకు సంబంధించిన పరీక్షా పేపర్‌ను ఆన్‌లైన్లో డౌన్‌లోడ్‌ చేసే ప్రక్రియలో విద్యుత్‌ కోత సంభవించడం, సర్వర్‌ నెమ్మదిగా పనిచేయడం వంటి సాంకేతిక కారణాలతో అనుకున్న సమయం కంటే సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా పరీక్షను అధికారులు నిర్వహించారు. ఫలితంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగాల్సిన పరీక్ష 9.45 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12.45 గంటలకు ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement