2030 నాటికి పదింతల అణువిద్యుత్! | nuclear power will be grown till 2030 | Sakshi
Sakshi News home page

2030 నాటికి పదింతల అణువిద్యుత్!

Jun 11 2014 12:05 AM | Updated on Sep 4 2018 5:07 PM

దేశ అణువిద్యుత్తు రంగంలో పెనుమార్పులకు రంగం సిద్ధమైందని. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చే లక్ష్యంతో స్థాపిత అణు శక్తి సామర్థ్యాన్ని పదింతలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్) డెరైక్టర్ శేఖర్ బసు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: దేశ అణువిద్యుత్తు రంగంలో పెనుమార్పులకు రంగం సిద్ధమైందని. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చే లక్ష్యంతో స్థాపిత అణు శక్తి సామర్థ్యాన్ని పదింతలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్) డెరైక్టర్ శేఖర్ బసు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన అణు ఇంధన సముదాయం (నూక్లియ ర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్, ఎన్‌ఎఫ్‌సీ) 41వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుత అణువిద్యుత్ సామర్థ్యం 4,700 మెగావాట్లు కాగా, 2030 నాటికి ఇది 50 వేల మెగావాట్లకు పెరగనుందని అన్నారు.
 
 
 కుడంకుళం విద్యుత్ కేంద్రం వెయ్యి మెగావాట్ల సామర్థ్యానికి చేరుకుందని, భావని రియాక్టర్ నిర్మాణ పనులు కూడా 98 శాతం వరకూ పూర్తయ్యాయని ఆయన వివరించారు. దేశం మొత్తమ్మీద ప్రస్తుతం 5,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న అణువిద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని, 12, 13వ పంచవర్ష ప్రణాళికల కాలం పూర్తయ్యేసరికి మరో 17 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని వివరించారు. అయితే కొత్త రియాక్టర్ల నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎం చుకోవడంలోనూ, నిధులు సమీకరించడంలోనూ కొన్ని ఇబ్బం దులున్నాయని ఆయన చెప్పారు. మోడీ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ ఇబ్బందులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. సైనిక, పౌర అవసరాల కోసం చిన్నస్థాయి అణురియాక్టర్ల తయారీకి ప్రయత్నాలు చేస్తున్నామని, పరిశోధనల దశను దాటిన తరువాత వచ్చే పంచవర్ష ప్రణాళిక సమయానికి దీన్ని ప్రతిపాదిస్తామని వివరించారు.
 
 ఎన్‌ఎఫ్‌సీ పదింతలు కావాలి..
 
 దేశంలో భారీ ఎత్తున అణువిద్యుత్తు ఉత్పత్తి జరగనున్న నేపథ్యంలో కొత్త రియాక్టర్లన్నింటికీ ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఎన్‌ఎఫ్‌సీని పదింతలు విస్తరించాల్సి ఉంటుందని భారత అణుశక్తి సంస్థ అదనపు కార్యదర్శి సీబీఎస్ వెంకట రమణ తెలిపారు. ఎన్‌ఎఫ్‌సీ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న విద్యుత్ అవసరాలను అణుశక్తి ద్వారా మాత్రమే తీర్చగలమని అభిప్రాయపడ్డారు. అణువిద్యుత్తు వల్ల ప్రమాదాలు జరుగుతాయనడం కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. ఎన్‌ఎఫ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సాయిబాబా మాట్లాడుతూ, అణు ఇంధన ఉత్పత్తి విషయంలో ఎన్‌ఎఫ్‌సీ గత ఆర్థిక సంవత్సరం రికార్డు సృష్టించిందని తెలిపారు. మొత్తం 961 టన్నుల అణు ఇంధనాన్ని శుద్ధీకరించి సరఫరా చేశామని, దీంతోపాటు 14 లక్షల ఫ్యూయెల్ ట్యూబులు, 561 టన్నుల ఇన్‌గాట్స్‌ను అణురియాక్టర్లకు అందించామని అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా అణు ఇంధన ఉత్పత్తిని మరింత పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement