అటవీశాఖలో అవినీతికి చెక్‌

No Corruption Of Wood Order By Forest Department In ongole - Sakshi

సాక్షి, ఒంగోలు : కలప పర్మిట్ల జారీలో దండిగా అక్రమార్జన సాగుతోంది. వందలు, వేలు కాదు రూ.లక్షల్లోనే చేతులు మారుతున్నాయి. జిల్లాలో ఏటా రూ.200 కోట్ల మేర లావాదేవీలు జరుగుతుంటే ఇందులో హీనపక్షం రూ.20 కోట్లపైనే అవినీతి, కొందరు అధికారుల అక్రమార్జన దందా కొనసాగుతోంది. రంపం కోత యంత్రం యజమానులు, అడితి నిర్వాహకులు, కలప చిరు వ్యాపారులు ఈ దందాను అతి భారంగానే భరిస్తున్నారు. అటవీ అధికారులు దండుకొనే మొత్తాలకు సంభందిత వ్యాపారులు అదనంగా మరి కొంత అ‘ధనం’ మొత్తాలను కలిపి కలప కొనుగోలుదార్ల నెత్తిన మోపుతున్నారు.

ప్రతి స్థాయిలోనూ జరిగే ఈ వసూళ్లు తంతుతో రూ. వందల్లో అయ్యే ఖర్చు రూ.వేలల్లోకి పోతుంది. అసలు ధర కన్నా రెండు,మూడు రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వినియోగదారునికి అంతిమంగా ఈ మొత్తం పెను భారంగా మారుతోంది.ప్రతి నిర్మాణానికి కలప అవసరం నేపథ్యంలో ఇప్పటికి నడుస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధి కారి ప్రతీప్‌కుమార్‌ కార్యాలయాన్ని అవినీ తి రహిత కార్యాలయంగా నామఫలకాన్ని ఏర్పా టు చేశారు. అన్ని అటవీ క్షేత్రాధికారుల కార్యాలయాల్లోనూ ఇదే తరహాలో నో కరప్షన్‌ ఆఫీసు లుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం.

ఈ లక్ష్యం చేరుకోవడానికి అటవీ శాఖలోని అన్ని లావాదేవీలు ఇక పాదర్శకంగా జరిగే విధంగా మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో మొదటి మార్పు కీలకమైన కలప రవాణా పర్మిట్ల జారీని ఆన్‌లైన్‌ చేయాలన్నది తలంపు. కలప రవాణా లో చెట్టు నరికిన దగ్గర నుంచి వివిధ స్థాయిల్లో రూపాంతరం చెంది చివరి స్థాయికి చేరే సరికి వివిధ హోదాల్లోని ఉద్యోగుల  చేతులు తడిపే పద్ధతికి  త్వరలోనే అడ్డుకట్టపడనుంది.

సీఎం దృష్టికి ఆన్‌లైన్‌ విధానం
కలప మాన్యువల్‌ పర్మిట్ల జారీలో జరుగుతున్న తంతు గురించి అటవీ ఉన్నతాధికారులు గుర్తించారు.  అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినప్పుడు ఈ నూతన విధానం గురించి సీఎంతో చర్చించారు.  పర్మిట్లను ఆన్‌లైన్‌లో ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పారదర్శక విధానం అమలులో ఉంటుందని అన్నారు. సత్వరం పర్మిట్లు జారీ అవుతాయన్నారు.

దీనిపై సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. త్వరలోనే పర్మిట్లను ఆన్‌లైన్‌ పద్దతిలో ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు ప్రతీప్‌కుమార్‌ కార్యాచరణకు పూనుకున్నారు.8వ తేదీన ఒంగోలుకు వచ్చి ఇక్కడ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఆరు సర్కిళ్లల్లోనూ తాను పర్యటించి త్వరలోనే ఇందుకు సంభందించిన మార్గదర్శకాలను తయారు చేస్తామని అన్నారు. త్వరలోనే పర్మి ట్ల జారీ విధానంతో పాటు అటవీ శాఖలోని వివిధ లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే జరగనున్నాయన్న సంకేతాలను ఇచ్చారు.  ఇకపై అన్ని లావాదేవీల్లో అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నందున ఇక ఈ విధానానికి చెల్లుచీటీ ఇచ్చి పాదర్శక విధానం ఆన్‌లైన్‌కు శ్రీకారం చుట్టడానికి కార్యాచరణకు పూనుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top